ఆగస్టు 24న వరలక్ష్మీ వ్రతానికి విస్తృత ఏర్పాట్లు టిటిడి తిరుపతి జెఈవో పోల భాస్కర్

సిరులతల్లి తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆగస్టు 24న నిర్వహించనున్న వరలక్ష్మీ వ్రతానికి భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని విస్తృత ఏర్పాట్లు చేపడుతున్నట్టు టిటిడి తిరుపతి సంయుక్త కార్యనిర్వహణాధికారి పోల భాస్కర్ తెలిపారు. తిరుచానూరులోని ఆస్థానమండపంలో గురువారం ఆయన వరలక్ష్మీ వ్రతం ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ వరలక్ష్మీ వ్రతం టికెట్లను ఆగస్టు 23వ తేదీన 200 టికెట్లను ఆలయం వద్ద గల కౌంటర్లో విక్రయించాలని అధికారులకు సూచించారు. వరలక్ష్మీ వ్రతాన్ని భక్తులు తిలకించేందుకు వీలుగా ఆస్థానమండపంలో, రథమండపం వద్ద ఎల్ఇడి స్క్రీన్లు ఏర్పాటుచేయాలని ఆదేశించారు. అమ్మవారి ఆలయం, ఆస్థాన మండపం, ఇతర ప్రాంతాల్లో ఆకట్టుకునేలా పుష్పాలంకరణ, విద్యుద్దీపాలంకరణ చేపట్టాలని సూచించారు. కంకణాలు, కుంకుమ ప్యాకెట్లు, కరపత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలని, భజన బృందాలను ఏర్పాటుచేయాలని హిందూ ధర్మప్రచార పరిషత్ అధికారులను ఆదేశించారు.
వరలక్ష్మీ వ్రతాన్ని ఎస్వీబీసీలో ప్రత్యక్ష ప్రసారాలు అందించేందుకు వీలుగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆస్థానమండపంలో భక్తులకు ఇబ్బందులు లేకుండా క్యూ లైన్లు ఏర్పాటు చేయాలన్నారు. అమ్మవారి దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసే అవకాశం ఉండడంతో ముందస్తుగా ఏర్పాట్లు చేపట్టాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com