కార్బైడ్ తెగులు వదిలించేందుకు ప్రయోగాలు..

సూర్యాపేట జిల్లాలోనే కాక ఉమ్మడి నల్గొండ జిల్లాలో నిమ్మకాయలను మగ్గబెట్టేందుకు కార్బైడ్‌ను యథేచ్ఛగా వాడుతున్నారు పలువురు వ్యాపారులు. కొందరు రైతులు కూడా ఇలాంటి పనే చేస్తూ నిమ్మ పంటను అమ్ముకుంటున్నారు. కార్బైడ్‌పై నిషేధం ఉన్నా పట్టింపు లేకుండా ధానార్జనే ధ్యేయంగా మరికొందరు రెచ్చిపోతున్నారు. ఏదేమైనా నిమ్మకాయలను కార్బైడ్‌తో పండించి కొందరు సొమ్ము చేసుకుంటుంటే మరికొందరు తీవ్రంగా నష్టపోతున్నారు. వాస్తవానికి ప్రతీ ఏటా నిమ్మ ధరల్లో భారీగా తగ్గుదల ఉంటోంది. అందుకే రైతులు కాయలు తెంపిన వెంటనే కాల్షియం కార్బైడ్‌తో మగ్గబెతున్నారు. సహజంగా మగ్గితే పదిరోజులకుపైగా నిల్వ ఉంటాయి. మాగేందుకు 20 రోజులు పడుతుంది. బట్టీల్లో కార్బైడ్‌ ద్వారా 18 గంటల్లోనే పండ్లుగా మార్చుతున్నారు పలువురు. ఎంత ఆకుపచ్చని కాయయినా కార్బైడ్‌ కారణంగా పసుపు వర్ణంలోకి మారిపోతోంది. ఇలా నిగనిగలాడే కాయలపై వ్యాపారులు భారీగానే ఖర్చు పెడుతున్నారు. అయితే ఇవి 4 రోజులు మించి నిల్వ ఉండకపోవడంతో పలువురు నష్టపోతున్నారు. సహజంగా పక్వానికి వచ్చినా లేతవర్ణంలో ఉంటాయి. ఇవి ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. కార్బైడ్‌ వాడి పక్వానికి తెచ్చిన నిమ్మకాయలు 4 రోజుల మించి నిల్వ ఉండవు. వీటిని ఢిల్లీ లాంటి దూర ప్రాంతాలకు రవాణా చేసి విక్రయించాలంటే కనీసం ఐదు రోజులు పడుతుంది. ఇంతలోనే సగం వరకు పాడవుతాయి. ఈ భారం తగ్గించుకునేందుకు తక్కువ ధరకు వ్యాపారులు కొంటుండటంతో రైతులకు నష్టం వాటిల్లుతోంది.
తెలంగాణలో అత్యధికంగా నిమ్మ సాగు అయ్యే ప్రాంతాల్లో నల్గొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, ఖమ్మం, ఆదిలాబాద్‌ జిల్లాలు ఉన్నాయి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో దాదాపు 30వేల హెక్టార్లల్లో నిమ్మ సాగవుతోంది. ఏటా రూ.750 కోట్లకుపైగా వ్యాపారం జరుగుతోంది. ఇంత ప్రత్యేకత ఉన్న నల్గొండ నిమ్మకు కార్బైడ్‌ తెగులు అంటుకోవడం ఆందోళనకరం. కాల్బొడ్‌తో మగ్గబెట్టిన నిమ్మపండ్లను ఏటా లక్షల టన్నుల్లోనే ఇక్కడి నుంచి ఇతర జిల్లాలకే కాక ఇతర రాష్ట్రాలకూ ఎగుమతి చేస్తున్నారు. ఫలితంగా వ్యాపారులు నష్టపోతున్నారు. కొన్ని చోట్ల అయితే వ్యాపారులు తక్కువ ధర చెల్లిస్తుండడంతో రైతులు నష్టపోతున్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు వ్యవసాయ విభాగం పరిశోధనలు చేస్తోంది. తక్కువ ఖర్చులోనే ఎక్కువకాలం పంట మన్నికగా నిలిచి ఉండే విధానాలపై రీసెర్చ్ చేస్తోంది. ఈ క్రమంలో ఇథిలిన్ ద్వారా పండించే పద్ధతి మెరుగైన విధానంగా గుర్తించారు. ఇథిలిన్ రైపనింగ్ సిస్టమ్ మామిడి విషయంలో విజయవంతమైంది. దీంతో నిమ్మకూ ఈ విధానం ఉపయుక్తంగా ఉంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. రైతులు ఇథిలిన్ గదులు ఏర్పాటు చేసుకుని 2టన్నుల వరకు కాయలు మగ్గబెట్టడం, 20 రోజులు నిల్వ ఉండేలా ప్రయోగాలు చేస్తున్నారు. దీనికోసం బాలాజీ రకం నిమ్మపై అధ్యయనం సాగిస్తున్నారు. ఈ అధ్యయనం, ప్రయోగాలు ఫలవంతమైతే నిమ్మరైతులకు మేలు జరుగుతుంది. ప్రజల ఆరోగ్యానికి హానిచేసే కార్బైడ్‌ వినియోగం తగ్గుతుందని అంతా ఆశిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com