ఐదు టెస్ట్ ల సిరీస్ లో ఇంగ్లాండ్ లీడ్

విజయానికి చేరువ అవుతోందన్న మరుక్షణంలోనే టీమిండియాకు భారీ షాక్‌ తగిలింది. ఎంతో నమ్మకం పెట్టుకున్న సారథి విరాట్‌ కోహ్లీ (51; 93 బంతుల్లో 4×4) అనూహ్యంగా పెవిలియన్‌కు చేరుకున్నాడు. ఇంగ్లాండ్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌స్టోక్స్‌ అతడిని వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు.ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో కోహ్లి ఒంటరి పోరాటం చేస్తున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 274 పరుగులు చేస్తే అందులో కోహ్లి చేసినవే 149 రన్స్ ఉండటం గమనార్హం. ఇంగ్లిష్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్న విరాట్.. మొక్కవోని దీక్షతో బ్యాటింగ్ చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లోనూ ఓ ఎండ్‌లో వికెట్లు పడుతున్నా.. మరో ఎండ్‌లో కోహ్లి పాతుకుపోయాడు. దీంతో ఇంగ్లాండ్ విజయానికి కోహ్లి అడ్డుగా నిలిచాడు. రెండో ఇన్నింగ్స్‌లో ముగ్గురు భారత బ్యాట్స్‌మెన్ 13 పరుగుల వద్ద వెనుదిరిగారు. ఓపెనర్ శిఖర్ ధావన్, లోకేష్ రాహుల్ ఇద్దరూ సరిగ్గా 24 బంతుల్లో 13 రన్స్ చేసి అవుటయ్యారు. దినేశ్ కార్తీక్, హార్దిక్ పాండ్యల కంటే ముందుగా బ్యాటింగ్‌కి దిగిన అశ్విన్ దూకుడుగా ఆడే ప్రయత్నం చేశాడు. 15 బంతుల్లోనే 13 పరుగులు చేసి అవుటయ్యాడు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 110/5తో నిలవగా.. ముగ్గురు బ్యాట్స్‌మెన్ 13 పరుగుల వద్దే పెవిలియన్ చేరారు. ముగ్గురు భారత బ్యాట్స్‌మెన్ ఒకే ఇన్నింగ్స్‌లో 13 పరుగుల వద్ద అవుటవడం ఇదే తొలిసారి. 13 అంకెను పాశ్యాత్యులు అశుభంగా భావిస్తారు. ఓవరాల్‌గా టెస్టుల్లో ఇది ఏడోసారి కాగా, నాలుగో ఇన్నింగ్స్‌లో మాత్రం ఇదే ఫస్ట్ టైం. 1991 తర్వాత కూడా టెస్టుల్లో ఇలా జరగడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. ఇలా జరిగిన సమయంలో న్యూజిలాండ్ మాత్రమే విజయం సాధించింది. అది కూడా భారత్‌పైనే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com