ఆరు జిల్లాల్లో కరవు పరిస్థితులు

రాష్ట్రంలో ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌లో కరువు వల్ల భారీగా పంట నష్టం సంభవించిందని కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం, నెల్లూరు, ప్రకాశం జిల్లాల అధికారులు ప్రభుత్వానికి నివేదికలు పంపించారు. దాదాపు 5 లక్షల హెక్టార్లలో 33 శాతానికిపైగా పంట దెబ్బతిందని, దీనివల్ల 3.10 లక్షల టన్నుల మేర వ్యవసాయోత్పత్తుల దిగుబడి పడిపోయినట్లేనని పేర్కొన్నారు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల ఏడు జిల్లాల్లో పంటలు ఎండిపోతున్న పరిస్థితుల్లో జూన్, జూలై నెలల వర్షపాతం, వర్ష విరామం (డ్రైస్పెల్‌), ఇతర నిబంధనను అడ్డం పెట్టుకుని ప్రభుత్వం ఈ నెల 8న 275 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించిన విషయం తెలిసిందే. కరువు మండలాల్లో రైతుల వారీగా, పంటల వారీగా నష్టాలను మదించి త్వరగా నివేదికలు పంపాలని ఆరు జిల్లాల అధికార యంత్రాంగాన్ని రాష్ట్ర సర్కారు ఆదేశించింది. దీంతో ఈ జిల్లాల్లోని 275 కరువు మండలాల్లో రైతుల వారీగా, పంటల వారీగా నివేదికలు రూపొందించి సంయుక్త వ్యవసాయ కమిషనర్లు కలెక్టర్లకు సమర్పించారు.ఆయా జిల్లాల కలెక్టర్ల సూత్రప్రాయ ఆమోదంతో రాష్ట్ర ప్రభుత్వానికి పంపించారు. కేంద్ర కరువు నిబంధనావళి ప్రకారం 33 శాతం లోపు పంట నష్టం వాటిల్లిన వారికి ఎలాంటి సాయం (పెట్టుబడి రాయితీ) ఇవ్వరు. అందువల్ల ఇలాంటి నష్టాలను వ్యవసాయ అధికారులు పరిగణనలోకి తీసుకోలేదు. మొత్తం 5 లక్షల హెక్టార్లలో(12.5 లక్షల ఎకరా) 3.10 లక్షల టన్నుల మేరకు పంట దిగుబడి కోల్పోయినట్లు ఆయా జిల్లాల అధికారులు పంపిన నివేదికల్లో పేర్కొన్నారు. కరువు మండలాల్లో పంట నష్టంపై ప్రాథమిక నివేదికలను ప్రభుత్వానికి పంపామని కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం, నెల్లూరు, ప్రకాశం జిల్లాల అధికారులు తెలిపారు. పంట నష్టపోయిన 7.40 లక్షల మంది రైతులకు రూ.695 కోట్లు పైగా పెట్టుబడి రాయితీ ఇవ్వాలని అధికారులు నివేదించినట్లు తెలిసింది. జిల్లాల నుంచి వచ్చిన నివేదికలను వ్యవసాయ శాఖ క్రోడీకరించి పంట నష్టం వివరాలతో సమగ్రమైన నివేదిక రూపొందించి రాష్ట్ర విపత్తు నిర్వహణ కమిషనర్‌కు పంపుతుంది. విపత్తు నిర్వహణ కమిషనర్‌ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనుమతితో సంబంధిత మంత్రికి, ముఖ్యమంత్రికి పంపించి వారి ఆమోదంతో కేంద్ర ప్రభుత్వానికి కరువు సాయం కోసం నివేదిక పంపనున్నారు. తుది నివేదికను ఈ వారంలో కేంద్ర ప్రభుత్వానికి పంపే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com