పక్కదారి పడుతున్న తాగునీరు పథకం

గ్రామీణ ప్రజలకు నిరంతరం పరిశుభ్రమైన తాగునీరు అందించాలన్న ప్రభుత్వ లక్ష్యం నీరుగారిపోతోంది. గ్రామ స్థాయిలో ఎప్పటికప్పుడు తాగునీటి పరీక్షలు నిర్వహించుకునేందుకు వీలుగా ప్రతి గ్రామానికి తాగునీటి పరీక్ష కిట్లను సరఫరా చేస్తోంది. గ్రామీణ నీటి సరఫరా విభాగంలోని తాగునీటి పరీక్ష కేంద్రాల అధికారుల ద్వారా రెండేళ్ల కిందట వీటిని సరఫరా చేశారు. ఆ తర్వాత సరఫరా నిలిచిపోయింది. ప్రతి గ్రామంలో ఇద్దరికి తాగునీటి పరీక్ష విషయమై శిక్షణ ఇచ్చినా.. కిట్ల సరఫరా నిలిచిపోవడంతో గ్రామాల్లో పరీక్షలు ఆగిపోయాయి.. వర్షాకాలంలో తాగునీరు కలుషితమయ్యే అవకాశం ఎక్కువ. ఈ సమయంలోనే తాగునీటి పరీక్షలు అవసరం ఎక్కువగా చేయాల్సి ఉంటుంది. కిట్లు లేకపోవడంతో గ్రామీణ ప్రాంతాల్లో వీటిని పట్టించుకునే వారే లేరు. ప్రభుత్వం తక్షణమే వీటిని సరఫరా చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం తాగునీటి సరఫరా విభాగం ద్వారా రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ఈ కిట్లను సరఫరా చేశారు. గతేడాదిగా వీటి సరఫరా నిలిచిపోవడంతో గ్రామీణ స్థాయిలో పరీక్షలు చేపట్టడం లేదు. గతంలో ఇచ్చిన కిట్ల గడువు కూడా ముగిసిపోయింది. క్షేత్ర సహాయకులు గ్రామాలకు వెళ్లినప్పుడు కిట్లు అందుబాటులో లేకపోతే సాధారణంగా సీసాల్లో తీసుకొచ్చి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి వర్షాకాలంలో తాగునీటి పరీక్షలు ఎప్పటికప్పుడు నిర్వహించుకునేందుకు ఈ కిట్లను సరఫరా చేయాల్సిన అవసరం ఉంది. అధికారులు మాత్రం తమకు గత ఏడాది నుంచి సరఫరా లేవని తెలిపారు.
గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి పథకాలకు సంబంధించిన బావులు, బోరుబావుల ద్వారా సరఫరా చేస్తున్న నీటిని గ్రామాల్లోనే పరీక్షించేందుకు గ్రామీణ నీటి సరఫరా విభాగం ప్రతి గ్రామానికి 2016లో కిట్లు సరఫరా చేసింది. ఆరు రకాల పరీక్షలను వీటి ద్వారా చేపట్టవచ్చు. ఏడాదికి పైగా వీటిని వినియోగించుకునే అవకాశం ఉంది. వీటిని ఉపయోగించి పరీక్ష చేసిన తర్వాత నివేదికను సంబంధిత గ్రామీణ నీటి సరఫరా సహాయక ఇంజనీర్‌కు తెలియజేయాలి. నీరు కలుషితమైనట్లు తేలితే జిల్లా, డివిజన్‌ ప్రయోగశాలలకు పంపించి మరోసారి పరీక్షలు నిర్వహించి తగిన చర్యలు చేపడుతారు. ఈ విధానం గతేడాది వరకు కొనసాగింది.కిట్స్‌ను గ్రామ పంచాయతీ పరిధిలో నిల్వ చేస్తారు. సహాయక ఇంజినీరు, సర్పంచి ఆధ్వర్యంలో గ్రామానికి చెందిన ఇద్దరిని ఎంపికచేసి శిక్షణ ఇచ్చారు. గ్రామ పరిధిలోని పంచాయతీ సిబ్బంది, ఏఎన్‌ఎం, ఆశా వర్కర్‌, ఇతరులు ఎవరినైనా ఎంపిక చేయవచ్చు. గ్రామీణ నీటి సరఫరా విభాగంలోని తాగునీటి పరీక్షా కేంద్రాల్లో అర్హులైన నిపుణుల ద్వారా శిక్షణ ఇచ్చారు. వారు ఈ పరీక్షలను చేపడుతున్నారు. ఏదైనా అత్యవసర పరిస్థితిలో పరీక్షలు చేయాల్సి వస్తే తాగునీటి పరీక్షల కేంద్రాలకు సంబంధించిన క్షేత్ర సహాయకులు గ్రామాలకు వెల్లినపుడు కిట్లను ఉపయోగించి నీటి పరీక్షలు చేసి తాత్కాలిక నివేదిక ఇస్తున్నారు. ఈ విధానం అన్ని గ్రామాల్లో అమలైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *