అదుపులోనే విష జ్వ‌రాలు.. ఆందోళ‌న వ‌ద్దు ఉన్న‌తాధికారుల‌తో స‌మీక్షించిన వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి డాక్ట‌ర్ సి ల‌క్ష్మారెడ్డి

ఏజెన్సీ ప్ర‌జ‌లు ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని, అందుబాటులో మందులు, వైద్యం, డాక్ట‌ర్లు, సిబ్బంది సిద్దంగా ఉన్నాయ‌ని వైద్య ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ‌శాఖ మంత్రి డాక్ట‌ర్ సి ల‌క్ష్మారెడ్డి తెలిపారు. వ‌ర్షాలు వ‌ర‌స‌గా కురుస్తున్న నేప‌థ్యంలో ఏజెన్సీ ప్రాంతాల్లో విష జ్వ‌రాలు ప్ర‌బ‌లే అవ‌కాశం ఉన్నందున మంత్రి సంబంధిత శాఖ‌ల ఉన్న‌తాధికారుల‌తో హైద‌రాబాద్‌లో స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ, గ‌త సీజ‌న్ల‌ లాగే ఈ సీజ‌న్ లోనూ విష జ్వ‌రాల అదుపున‌కు కావాల్సిన జాగ్ర‌త్త‌ల‌న్నీ తీసుకున్నామ‌న్నారు. ముంద‌స్తుగా ఏజెన్సీ ప్రాంతాల జిల్లాల క‌లెక్ట‌ర్లు, వైద్యాధికారుల‌తో స‌మీక్ష‌లు నిర్వ‌హించి అప్ర‌మ‌త్తం చేశామ‌న్నారు. అవ‌స‌ర‌మైన మందులు, ప‌రీక్ష‌ల కిట్లు, వైద్యులు, సిబ్బందిని సంసిద్ధం చేసి ఉన్నామన్నారు. అయితే ఈ మ‌ధ్య కురుస్తున్న వ‌ర్షాల కార‌ణంగా అంటు వ్యాధులు, విష జ్వ‌రాలు ప్ర‌బ‌లే అవ‌కాశం ఎక్కువగా ఉంద‌న్నారు. ఆయా అంటు వ్యాధులు, విష జ్వ‌రాలను అదుపు చేసే విధంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ప‌ని చేస్తున్న వైద్యులు, సిబ్బంది అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించారు. ఈ మేర‌కు మంత్రి వైద్యాధికారుల‌ను హెచ్చ‌రించాల‌ని వైద్య ఆరోగ్య‌శాఖ ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ శాంతికుమారి, కుటుంబ సంక్షేమ‌శాఖ క‌మిష‌న‌ర్ వాకాటి క‌రుణ‌ల‌కు చెప్పారు. వివిధ శాఖ‌ల‌తో స‌మ‌న్వ‌యం చేసుకుంటూ, వైద్యాధికారుల‌తోనూ ఎప్ప‌టిక‌ప్పుడు స‌మీక్షించాల‌ని చెప్పారు. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఎవ‌రూ కూడా వైద్యం అంద‌కుండా ఇబ్బందులు ప‌డొద్ద‌ని సూచించారు. ప్ర‌జ‌లు సైతం త‌మ‌కు జ్వ‌ర సంబంధ సూచిక‌లు క‌నిపిస్తే వెంట‌నే స‌మీప ప్ర‌భుత్వ ద‌వాఖానాకు వెళ్ళాల‌ని చెప్పారు. వెంట‌నే త‌గు ప‌రీక్ష‌లు చేయించుకుని చికిత్స చేయించుకోవాల‌ని అన్నారు. కొద్దిపాటి జాగ్ర‌త్త‌లు తీసుకుంటే ఆరోగ్యం మ‌న అదుపులోనే ఉంటుంద‌న్నారు. ఏజెన్సీ ప్రాంతాల ప్ర‌జ‌ల‌కు గ‌త సీజ‌న్‌లోనే దోమ తెర‌లు ఉచితంగా పంపిణీ చేశామ‌ని, వాటిని వినియోగిస్తే దోమ‌ల సంబంధ విష జ్వరాలు పూర్తిగా అదుపులో ఉంచుకోవ‌చ్చ‌న్నారు. వ్య‌క్తిగ‌త ప‌రిశుభ్ర‌త‌ని, ప‌రిస‌రాల పారిశుద్ధ్యాన్ని కాపాడుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. ఈ దిశ‌గా మిగ‌తా శాఖ‌తు స‌హ‌క‌రించాల‌ని మంత్రి విజ్ఞ‌ప్తి చేశారు. ఈ స‌మీక్ష‌లో మంత్రితోపాటు వైద్య ఆరోగ్య‌శాఖ ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ శాంతికుమారి, కుటుంబ సంక్షేమ‌శాఖ క‌మిష‌న‌ర్ వాకాటి క‌రుణ‌, స‌రోజ‌నీ కంటి ద‌వాఖానా సూపరింటెండెంట్ డాక్ట‌ర్ ర‌వింద‌ర్ గౌడ్ త‌దిత‌రులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com