స్పెషలాఫీసర్లుగా జిల్లా స్థాయి అధికారులు

కొత్తగా ఏర్పాటైన మున్సిపాలిటీలకు కమిషనర్లను, ప్రత్యేకాధికారులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి ఆదిలాబాద్‌ పరిధిలోని మంచిర్యాల జిల్లాలో నస్పూర్, క్యాతనపల్లి, చెన్నూర్, లక్సెట్టిపేట, నిర్మల్‌ జిల్లాలోని ఖానాపూర్‌ మేజర్‌ గ్రామ పంచాయితీలను మార్చి నెలాఖరులో మున్సిపాలిటీలుగా మారుస్తూ ప్రభుత్వం చట్టం చేసింది. గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల పదవీకాలం ముగిసిన వెంటనే మున్సిపాలిటీలుగా మారుతాయని ప్రకటించింది.. కొత్త వాటితో కలుపుకుని ఉమ్మడి జిల్లాలో మున్సిపాలిటీల సంఖ్య 12కు పెరగనుంది. ప్రస్తుతం ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, భైంసా, కాగజ్‌నగర్, మందమర్రి, బెల్లంపల్లి మున్సిపాలిటీలుగా ఉన్న విషయం తెలిసిందే. అలాగే కొత్త మున్సిపాలిటీలకు కమిషనర్లను, ప్రత్యేకాధికారులను సైతం ఎంపిక చేసి, హైదరాబాద్‌లో ప్రత్యేక శిక్షణ ఇప్పించారు.ఉమ్మడి ఆదిలాబాద్‌లో కొత్తగా ఏర్పాటైన ఐదు మున్సిపాలిటీలకు కమిషనర్లుగా ఆయా మండలాల తహసీల్దార్లనే ఎంపిక చేశారు. నస్పూర్‌కు ఇన్‌చార్జిగా ఉన్న మంచిర్యాల తహసీల్దార్‌ కుమారస్వామికి కమిషనర్‌గా బాధ్యతలు అప్పగించారు. ఆయన ఇక నుంచి రెండు మండలాలకు తహసీల్దార్‌గా, నస్పూర్‌ మున్సిపల్‌ కమిషనర్‌గా వ్యవహరించాల్సి ఉంటుంది. చెన్నూర్‌ మున్సిపాలిటీ కమిషనర్‌గా ఆ మండల తహసీల్దార్‌ శ్రీనివాస్‌ వ్యవహరిస్తున్నారు. లక్సెట్టిపేట తహసీల్దార్‌ రాజేశ్వర్‌ కొత్తగా ఏర్పాటైన మున్సిపాలిటీకి కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు. క్యాతనపల్లి మున్సిపాలిటీకి మందమర్రి తహసీల్దార్‌ ఇంతియాజ్‌ అహ్మద్, నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌ మున్సిపల్‌కు ఆ మండల తహసీల్దార్‌ ఆరె నరేందర్‌ కమిషనర్లుగా వ్యవహరించనున్నారు.మున్సిపాలిటీల ప్రత్యేకాధికారులుగా ఆర్‌డీవో స్థాయి అధికారులకు బాధ్యతలు అప్పగించారు. నస్పూర్‌కు జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి శ్యామలాదేవి, చెన్నూర్‌కు జిల్లా సహకార శాఖ అధికారి సంజీవరెడ్డి, క్యాతనపల్లికి మంచిర్యాల ఆర్‌డీవో శ్రీనివాస్, లక్సెట్టిపేట మున్సిపల్‌ ప్రత్యేకాధికారిగా జిల్లా వ్యవసాయ అధికారి వీరయ్యకు బాధ్యతలు అప్పగించారు. నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌ మున్సిపాలిటీ స్పెషలాఫీసర్‌గా ఆర్‌డీవో ప్రసూనాంబ బాధ్యతలు స్వీకరించారు. ఈ మున్సిపాలిటీలకు చైర్‌పర్సన్‌ ఉండనందున అభివృద్ధి పనులకు సంబంధించిన అన్ని నిర్ణయాలు వీరే తీసుకుంటారు. గ్రామ పంచాయతీ సర్పంచులు, వార్డు సభ్యుల పదవీకాలం ఆగస్టు ఒకటితో ముగిసింది.గ్రామ సర్పంచులకే ప్రత్యేక అధికారాలు ఇచ్చి కొనసాగించాలని చేసిన విజ్ఞప్తిని ప్రభుత్వం తిరస్కరించడంతో వారి ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. ఆగస్టు 2 నుంచి ప్రత్యేకాధికారుల పాలనలోకి గ్రామ పంచాయతీలు వెళ్లాయి. ప్రభుత్వం సాధారణ ఎన్నికలను గడువు కన్నా ముందే ఈ సంవత్సరం డిసెంబర్‌లో నిర్వహించాలని భావిస్తున్న గ్రామాల్లో ప్రత్యేకాధికారుల పాలన ఆరు నెలల వరకు తప్పనిసరి కానుంది. ఆ తరువాత కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తరువాతే స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలోని 1508 గ్రామ పంచాయతీలకు గాను పదవీకాలం మిగిలి ఉన్న ఐదు జీపీలను మినహాయించి 1503 మంది స్పెషలాఫీసర్లను నియమించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com