కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల డిమాండ్

తాము అధికారంలోకి వస్తే కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను దశల వారీగా రెగ్యులరైజ్‌ చేస్తామన్న తెలుగుదేశం ప్రభుత్వం, అధికారంలోకి రాగానే రెగ్యులరైజేషన్‌, తదితర సమస్యలపై మంత్రివర్గ సబ్‌ కమిటీని నియమిం చింది. కమిటీ మొదటి సమావేశం అయ్యాక కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులందర్నీ రెగ్యులరైజ్‌ చెయ్యడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రకటించింది. అయితే కొంత కాలం గడిచాక ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేయలేమంది. ఇంకొంత కాలం తర్వాత రెగ్యులరైజేషన్‌కు అర్హత వున్న కాంట్రాక్టు ఉద్యోగులు 9,335 మంది అని చెప్పింది. మరి కొంత కాలానికి ఈ సంఖ్యను 1,003 కుదిం చేసింది. పైగా ఇటీవల కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేయడానికి కోర్టు తీర్పులు అడ్డంకిగా ఉన్నాయంటోంది. కోర్టు తీర్పులు అడ్డంకిగా ఉన్న విషయం ఎన్నికలకు ముందు తెలియదా? తెలుసుకోకుండా హామీ ఎందుకిచ్చినట్లు? పాలకులు చేసిన 2/94 చట్టమే కదా అడ్డంకి. చంద్రబాబు గారికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే 2/94 చట్టాన్ని సవరించి రెగ్యులరైజ్‌ చేయవచ్చు కదా అని ప్రశ్నిస్తున్నారు.కోర్టు తీర్పులు అడ్డంకిగా ఉన్నాయంటూ తప్పించుకొంటున్న మంత్రులు, సమాన పనికి సమాన వేతనంపై సుప్రీంకోర్టు తీర్పుపై ఎందుకు నోరు మెదపటం లేదు? 2016 అక్టోబరులో సివిల్‌ అప్పీల్‌ 213 ఆఫ్‌ 2013 కేసులో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌, డైలీ వేజ్‌, కంటింజెంట్‌ తదితర తాత్కాలిక ఉద్యోగులందరికీ రెగ్యులర్‌ ఉద్యోగులతో సమానంగా వేతనాలు, సౌకర్యాలు కల్పించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు ప్రకారం సమ విలువలు కలిగిన పని చేస్తున్న వారికి సమానంగా వేతనాలు, సౌకర్యాలు కల్పించాలి. వేతనం అంటే కనీస బేసిక్‌ (ప్రాథమికంగా ఇచ్చేది), ఆ బేసిక్‌కు వర్తించే ఇతర సౌకర్యాలతో కలిపి చెల్లించాలి. వేతనమే కాక, రెగ్యులర్‌ ఉద్యోగికి అమలవుతున్న ఇతర సౌకర్యాలనూ అమలు చెయ్యాలని కాంట్రాక్టు కార్మికులు కోరుతున్నారు.రెగ్యులర్‌ ఉద్యోగులకు పిఆర్‌సి ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం దాదాపు రెండు సంవత్సరాల తర్వాత ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు జివో 151 ద్వారా వేతనాలు పెంచింది. మరో 8 నెలలు గడిచాక జివో 95 ద్వారా కాంట్రాక్టు ఉద్యోగులకు, ఆ తర్వాత జివో 7 ద్వారా ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగులకు, జివో 27 ద్వారా వైద్య, ఆరోగ్యశాఖలో వేతనాలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వేతన పెంపుదలలో గత సాంప్రదాయాలకు రాష్ట్ర ప్రభుత్వం తిలోదకాలిచ్చింది. గతంలో 8, 9 పిఆర్‌సిల కాలంలో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు రెగ్యులర్‌ ఉద్యోగుల స్కేల్‌లోని మినిమం బేసిక్‌ను వర్తింపచేశారు. కానీ దీనికి భిన్నంగా 10వ పిఆర్‌సి లోని సంబంధిత కేడర్ల కనీస బేసిక్‌ కన్నా తక్కువగా వేతనాలను పెంచారు. అదీ రెండు సంవత్సరాల తర్వాతే. అంటే కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు ఈ కాలానికి నష్టపోయారు. గతంలో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు ఒకేసారి సమంగా వేతనాలు పెరిగాయి. ఈసారి ఆ సంప్రదాయా లకు తిలోదకాలిచ్చారు. ఉద్యోగులను మూడు కేటగిరీలుగా విభజించి నష్టపరిచారు.ప్రస్తుతం సర్వశిక్షా అభియాన్‌లో ప్రభుత్వం పార్ట్‌టైం, కాంట్రాక్టు వ్యవస్థను కొనసాగిస్తున్నది. ఇప్పుడు దానికి బదులుగా ఔట్‌సోర్సింగ్‌ వ్యవస్థను తెస్తున్నది. మున్సిపాలిటీలలో వర్క్‌ కాంట్రాక్టు పద్ధతికి, పంచాయతీలలో గంటల లెక్కన వేతనాల చెల్లింపుకు శ్రీకారం చుట్టింది. వ్యవసాయ/ఫిషరీస్‌ తదితర శాఖల్లో ఇచ్చే అరకొర వేతనాలలోనే కోత విధించి ఇన్సెంటివ్‌ పద్ధతులు ప్రారంభించింది. ప్రోత్సాహకం అనేది అదనంగా ఇవ్వాలి. కాని ఉన్న వేతనాలలోనే కోత పెట్టడం ప్రోత్సాహకం ఎలా అవుతుంది? వైద్య, ఆరోగ్యశాఖలోని చంద్రన్న సంచార చికిత్స, 108, ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలు తదితర పథకాలలోని ఉద్యోగులందరికీ జివో 3 ప్రకారం వేతనాలు చెల్లించేవారు. ఇప్పుడు వారు సర్వీసు ప్రొవైడర్ల ద్వారా పని చేస్తున్నారనే పేరిట వేతన పెంపును అమలు చేయడంలేదు.
కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు, బతికుండగా ఇవ్వాల్సిన పరిహారం సంగతి మాట్లాడటం లేదుగానీ, చనిపోయాక మట్టి ఖర్చు లకు రూ.15 వేలు అంటూ జివో 119ను ఆగస్టు 1న విడుదల చేశారు. విద్యుత్‌ శాఖలో ప్రమా దాలు జరిగి ఔట్‌సోర్సింగ్‌ కార్మికులు తీగలపై, ట్రాన్స్‌ఫార్మర్లపై వేళ్ళాడటం నిత్యకృత్యమైన పరిస్థితుల్లో కనీస రక్షణ పరికరాలను కూడా సరఫరా చేయడం లేదు. అటవీ శాఖలో జరుగు తున్న ప్రమాదాలను పట్టించుకొనేవారు లేరు. అనేక శాఖలలో మెటర్నటీ లీవును అమలు చెయ్యడం లేదు. వైద్య, ఆరోగ్యశాఖలలో ఏఎన్‌ఎంలకు, కాంట్రాక్టు నర్సులకు ఇదే పరిస్థితి. కస్తూరిబా విద్యాలయాల్లో మెటర్నటీ లీవు లేక కొంతమంది టీచర్లు 9వ నెల వరకూ పని చేశారు. దీంతో సరైన విశ్రాంతి లేక ప్రసవ సమయంలో తీవ్ర అనారోగ్యానికి గురై ముగ్గురు టీచర్లు చనిపోయారు.ఇంటికో ఉద్యోగం అన్న రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఉద్యోగాల సంగతేమో కాని ఉన్న ఉద్యోగాలను తీసేసింది. ఉపాధి హామీలో ఫీల్డ్‌ అసిస్టెంట్లను తొలగించింది. 26 వేల ఆదర్శ రైతులను సాగనంపింది. హౌసింగ్‌ వర్క్‌ ఇన్‌స్పెక్టర్లను రోడ్ల పైకి నెట్టింది. ఎపి స్పేస్‌ అప్లికేషన్‌ సెంటర్లలోని కాంట్రాక్టు ఉద్యోగులను 450 రోజులుగా రోడ్డుకెక్కించింది. డాక్టర్లు లేని కారణంగా మోడీ ప్రభుత్వం నుండి నిధులు రావడం లేదని 800 మంది ఆయుష్‌ ఉద్యోగులకు కొనసాగింపు ఉత్తర్వులు ఇవ్వడం లేదు. కొనసాగింపు, 15 నెలల వేతన బకాయిలకై ఆయుష్‌ ఉద్యోగులు 50 రోజులుగా ఆందోళనలు నిర్వహించాల్సిన స్థితికి నెట్టిందీ ప్రభుత్వం. పోరాటాల ద్వారానే కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు కొన్నైనా విజయాలను సాధించుకున్నా రు. నేడు తీసుకుంటున్న వేతనాలు, పిఎఫ్‌, ఈఎస్‌ఐ సౌకర్యాలు, 15 క్యాజువల్‌ లీవులు, మెటర్నటీ లీవులు అన్నీ ఆందోళనలతో సాధించుకున్నవే. భవిష్యత్తులోనూ సమాన పనికి – సమాన వేతనం, రెగ్యులరైజేషన్లు పెద్ద ఎత్తున ఉద్యమించడం ద్వారానే సాధించుకోగలరు. ఇప్పటికే నెల రోజులుగా అన్ని జిల్లాల్లో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు సమస్యలపై అనేక కార్యక్రమాలు నిర్వహించారు. విద్యా, వైద్య ఆరోగ్య రంగంతో సహా అన్ని ప్రభుత్వ శాఖలు, విద్యుత్‌, ఆర్టీసీ తదితర ప్రభుత్వ రంగ సంస్థలు, స్థానిక సంస్థలు, సర్వశిక్షా అభియాన్‌, నేషనల్‌ హెల్త్‌ మిషన్‌, ఉపాథి హామీ, వెలుగు తదితర ప్రభుత్వ పథకాలు, యూనివర్సిటీలలోని కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు కలసి ఐక్యంగా ఉద్యమిస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పై సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com