ఎక్కడ చూసినా నిర్లక్ష్యమే..

తారకరామతీర్థసాగర్‌ ప్రాజెక్టు కోసం నిర్మిస్తున్న మట్టికట్ట పనులు పూర్తికాకముందే చిన్నపాటి వర్షాలకే జారిపోతుండడం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పుడే ఇలా ఉంటే భవిష్యత్తులో పరిస్థితి ఏమిటన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
తారకరామతీర్థసాగర్‌ ప్రాజెక్టు పనుల్లో నాణ్యతకు తిలోదకాలొదిలారు. పూసపాటిరేగ, డెంకాడ, భోగాపురం మండలాల్లోని 49 గ్రామాల్లో 24,710 ఎకరాలకు నీరివ్వాలన్నది లక్ష్యంతో ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. 2005లోనే పనులు ప్రారంభమైనా నేటికీ నత్తనడకనే సాగుతున్నాయి. అయితే జాప్యమే ప్రాజెక్టుకి శాపంగా మారింది. ప్రధానంగా ప్రాజెక్టులో 32.39 శాతం పనిగా ఉన్న మట్టికట్ట పనులు ముందుకు కదలట్లేదు. 9.24 కి.మీ. మేర జలాశయం చుట్టూ కట్ట నిర్మించాల్సి ఉంది. దాదాపు పదేళ్లుగా చేస్తున్నా నేటికీ 50 శాతమైనా పూర్తి కాలేదు. పైగా 2005-06లో గుత్తేదారుడికి ఇచ్చిన పనుల్ని సక్రమంగా చేయలేకపోవడంతో 2012-13లో మరో గుత్తేదారుకి 4.4 కి.మీ. మేర అప్పగించారు. సుమారు 11 మీటర్ల ఎత్తుతో కట్ట ఏర్పాటుచేయాల్సి ఉంది. అయితే మట్టికట్ట పరిధి అంతా కలియతిరిగి చూస్తే క్రమపద్ధతి లేకుండా అక్కడక్కడా ముక్కలు ముక్కలుగానే కట్ట పనులు చేస్తున్నారు. పైగా కోరాడపేట, ఎ.టి.అగ్రహారం, పడాలపేట గ్రామస్థులకు ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ ఇవ్వకపోవడంతో ఆయా గ్రామాల నుంచి నిపుణులు సూచించిన మట్టిని తీసుకెళ్లడానికి వీల్లేదని అడ్డుకుంటున్నారు. ఇదీ కట్ట పనులకు ఆటంకంగా నిలుస్తోంది. అసలే పనుల్లో జాప్యం జరుగుతుందనుకుంటుంటే మరోవైపు మట్టికట్టలో నాణ్యత లోపించడంతో చిన్నపాటి వర్షాలకే ఎక్కడికక్కడ గట్లు జారిపోతున్నాయి.

మట్టి కట్ట పనుల్లో నాణ్యత లోపాలు కొట్టిచ్చినట్లు కనిపిస్తున్నాయి. మట్టికట్టలో దిగువభాగంలో మాత్రమే రాతిపేర్పు ఉంటుంది. మిగతా భాగమంతా మట్టి నమూనా పరీక్షల తరువాత స్థానికంగా దొరికే మట్టినే ఉపయోగిస్తారు. వాస్తవానికి కాంక్రీట్‌ చేస్తే అది నీటిని నిలుపుదల చేయగలుగుతుంది. అలాంటిది కాంక్రీట్‌ కాకుండా అంత పెద్ద ప్రాజెక్టు నీటినంతా ఆపాలంటే కచ్చితంగా మట్టికట్టని పూర్తి నాణ్యతతో నిర్మించాల్సి ఉంటుంది. అందుకే ప్రతీ 200 మి.మీ. మందంతో మట్టి వేయగానే ఒకసారి తడిపి రోలర్‌తో రోలింగ్‌ చేయాల్సి ఉంటుంది. మొత్తం 11 మీటర్ల ఎత్తుకీ ఇలాగే పొరలు పొరలుగా వేసే విధానం పాటించాలి. ఈ పనులన్నీ ఏఈలు, డీఈలు ఎప్పటికప్పుడు పర్యవేక్షించుకోవాలి. అయితే మట్టి కట్ట పనులు ఏళ్లుగా సాగుతుండడంతో ఇన్నేళ్లు సంబంధిత అధికారులు సైతం సరిగా పట్టించుకోలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గుత్తేదారులకే పనులు వదిలేయడంతో చాలాచోట్ల రోలింగ్‌ చేయకుండా నేరుగా మట్టి తీసుకొచ్చి పోసేసి మమ అనిపించేసినట్లుగా ఆరోపణలున్నాయి.

ప్రస్తుతం చిరుజల్లులకే కట్ట గట్లు కూలిపోతుండడం ఆ వ్యాఖ్యలకు బలం చేకూరుస్తుంది. ఆఖరికి వెలుపలి భాగంలో నిర్మించిన రాతిపేర్పు సైతం ఎగుడుదిగుడుగా ఉండడంతో పాటు అవీ జారిపోతున్నాయి. కట్ట బలంగా లేకపోతే జలాశయంలో నీరు వదిలాక గండ్లు పడే ప్రమాదముంది. పైగా కట్ట నిర్మాణం కోసం చేస్తున్న సుమారు రూ.52 కోట్ల ఖర్చు బూడిదలో పోసిన పన్నీరవడం ఖాయం.. ఇప్పటికే కొన్నిచోట్ల పనుల్లో నాణ్యత లోపాల కారణంగానే బిల్లులు నిలిపేయడంతో, వాటిని ఆమోదించాలంటూ రాజకీయంగా ఉన్నతస్థాయి ఒత్తిళ్లు తీసుకొస్తున్నట్లుగా సమాచారం. కాని ఒక్కసారి బిల్లులు చెల్లించేస్తే నాసిరకం పనులకు అధికారులు బాధ్యత వహించాల్సి వస్తుందన్నది గమనార్హం. ఇప్పటికైనా అధికారులు స్పందించి గట్ల పనుల్ని వేగవంతం చేయడంతో పాటు లోపాల్ని సరిదిద్దించకపోతే భవిష్యత్తులో తీవ్ర నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com