ఆఫ్రికా ప్రతినిధులతో సీఎస్ భేటీ

ఆరోగ్యం, పట్టణాభివృద్ధి, వ్యవసాయం, పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఆఫ్రికా దేశాలతో సంబందాలు నెలకొల్పడానికి విస్తృత అవకాశాలున్నాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్.కె.జోషి తెలిపారు. గురువారం సచివాలయంలో ఆఫ్రికాలోని ఫ్రాంకోఫోన్ దేశాల నుండి వచ్చిన 23 మంది ఎడిటర్లు, జర్నలిస్టుల బృందంతో సి.యస్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఆర్ధిక శాఖ ముఖ్యకార్యదర్శి కె.రామకృష్ణారావు, సమాచార పౌర సంబంధాల శాఖ కమీషనర్ అర్వింద్ కుమార్, మీడియా అకాడమి సెక్రటరీ రాజమౌళి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సి.యస్ మాట్లాడుతూ భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం 29 వ రాష్ట్రంగా జూన్,2 2014 న అవతరించిందని, సంక్షేమం రంగంలోను, అభివృద్ది కార్యక్రమాల అమలులో ప్రొగ్రెసివ్ రాష్ట్రంగా నిలిచిందని వారికి తెలిపారు. హైదరాబాద్ నగరానికి 450 సంవత్సరాల చరిత్ర ఉందని ఇక్కడి ప్రజలు స్నేహ పూర్వక సంబంధాలు కొనసాగిస్తారని ఆఫ్రికా ప్రజలతో వివిధ రంగాలలో మరింత మెరుగైన సంబంధాలు, సహకారానికి అవకాశాలు ఉన్నాయని సి.యస్ అన్నారు. హైదరాబాద్ నగరంలో చక్కటి వాతావరణం ఉంటుందని, ఆధునిక, సాంప్రదాయ సంస్కృతులకు నిలయమని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో రాష్ట్రంలో అభివృద్ధి వేగంగా జరుగుతున్నదని వివరించారు. హైదరాబాదులో నెలకొన్న ప్రముఖ విద్యా సంస్ధలు, సౌకర్యాలు, కఠోర శ్రమతో తో ఐటి రంగంలో పురోగతి సాధించామన్నారు. తయారీ, సేవా రంగంలో అభివృద్ధి చెందిందన్నారు.
సమాజంలో వెనుకబడిన వర్గాల విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని, వచ్చే 5 నుండి 10 సంవత్సరాలలో విద్యా రంగంలో గుణాత్మక మార్పులు సాధిస్తామని అన్నారు. అర్హత ఉన్న విద్యార్ధుల విదేశి విద్యకు నిధులు అందిస్తున్నామన్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రెసిడెన్షియల్ పాఠశాలను సందర్శించాలని సి.యస్ వారిని కోరారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ప్రసూతి మరణాల సంఖ్యను తగ్గించామని , కేసిఆర్ కిట్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాలను పెంచామని అన్నారు. రాష్ట్ర ప్రజలకు ఆహ్లాదకరమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించడానికి తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని సామాజిక కార్యక్రమంగా అమలు చేస్తున్నామన్నారు.
రాష్ట్రంలో మిషన్ కాకతీయ ద్వారా 45 వేల చెరువులు పునరుద్ధరణ కార్యక్రమాన్ని చేపట్టామని, రైతుబీమా, రైతుబంధు, ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణాన్ని చేపడుతున్నామని వివరించారు.
దేశ వ్యాప్తంగా అమలవుతున్న పన్నుల విధానం, బడ్జెట్ రూపకల్పన, నిధుల కేటాయింపు, చట్టాల తయారీ, ప్రభుత్వాల ఎంపిక, పథకాలు, విద్యాకార్యక్రమాల అమలు తదితర అంశాలపై చర్చించారు.
సమాచార పౌర సంబంధాల శాఖ కమీషనర్ అర్వింద్ కుమార్ మాట్లాడుతూ మూడవ ఇండియా – ఆఫ్రికా సమ్మిట్ లో భాగంగా ఆఫ్రికాలోని ఫ్రాంకోఫోన్ దేశాలనుండి 23 మంది ఎడిటర్లు, జర్నలిస్టుల బృందం ఈ నెల 22 నుండి 25 వరకు హైదరాబాద్ లో పర్యటిస్తున్నదని సి.యస్ కు వివరించారు. హైదరాబాద్ లో తమ పర్యటనలో భాగంగా మెట్రోరైల్, టీ హబ్, టీసీఎస్, జినోమ్ వ్యాలీ, రామోజీఫిల్మ్ సిటి, ఫలక్ నామ ప్యాలెస్, జియాగూడాలో డబుల్ బెడ్ రూం ఇళ్ళ సందర్శన, జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఏయిర్ పోర్టును సందర్శిస్తారని తెలిపారు. బెనిన్, కామెరూన్, చాద్, కాంగో జిబోటి, ఐవోరి కోస్ట్, మెడగాస్కర్,మాలి, మోరాకొ, నైగర్, సెనెగల్, టోగొ, టునీసియా లాంటి 11 దేశాలకు చెందిన 23 మంది ఎడిటర్లు పర్యటిస్తున్నారన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com