50 వేల ఎకరాల్లో పంట నష్టం

వరద నీటి ప్రవాహంతో జిల్లాలో 50 వేల ఎకరాల్లో వివిధ రకాల పంటలు ముంపుబారిన పడినట్లు అధికార యంత్రాంగం ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఎంతెంత విస్తీర్ణంలో ఏయే పంటలు నష్టపోయాయనే అంశంపై కచ్చితమైన లెక్కలు తేల్చాలంటూ ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన వెంటనే క్షేత్ర స్థాయిలో పేర్ల నమోదు ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని చెబుతున్నారు. గోపాలపురం మండలంలో వరద నీటి ప్రవాహానికి 280 ఎకరాల్లోని వరి పంట కుళ్లిపోయినట్లు అధికారులు ఇప్పటికే తేల్చారు. మిగిలిన పంటలు ఎక్కడెక్కడ ఎంతెంత విస్తీర్ణంలో దెబ్బతినే అవకాశాలున్నాయనేది వరద, ముంపు నీరు పూర్తిగా తగ్గితే తప్ప చెప్పలేని పరిస్థితులు నెలకొన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో ముంపుబారిన పడిన పంటల విస్తీర్ణంపై జిల్లా కలెక్టర్‌ కాటంనేని భాస్కర్‌ నేతృత్వంలో ప్రభుత్వానికి నివేదిక పంపించాం. వరద నీరు తగ్గుముఖం పడితే తప్ప వరితో పాటు ఇతర రకాల పంటలు కచ్చితంగా ఎంత విస్తీర్ణంలో దెబ్బతిన్నాయనేది తేలదు. ప్రభుత్వం అనుమతి ఇస్తే పంటల వారీగా నష్టం అంచనాల నమోదు ప్రక్రియ ప్రారంభమవుతుంది. రెండ్రోజుల నుంచి వర్షాలు తగ్గుముఖం పట్టడంతో పంటలకు ఇతర ప్రాంతాల్లో చాలావరకూ మేలే జరిగింది. వరద నీటి ప్రవాహం తగ్గిన వెంటనే దెబ్బతినని చోట్ల పంటలు త్వరగా కోలుకోవడానికి రైతులు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం.గోదావరి నదికి వరద పోటు సాయంత్రానికి కూడా కొనసాగుతుండటంతో లంక గ్రామాలు ముంపుబారిన పడ్డాయి. ఎర్రకాలువ, రామిలేరు, తమ్మిలేరు, యనమదుర్రు, నక్కల, బొండాడ, రుద్రాయకోడు, మొగదిండి, తదితర డ్రెయిన్‌లు పొంగి పొర్లుతున్నాయి. జిల్లాలో సుమారు 45 వేల ఎకరాల్లో వరి పంట ముంపుబారిన పడినట్లు అధికారులు అంచనా వేశారు. ప్రధానంగా నిడదవోలు, తాడేపల్లిగూడెం, నల్లజర్ల, దెందులూరు, కుక్కునూరు, బుట్టాయిగూడెం, పాలకొల్లు, నరసాపురం, ఆచంట, ఉండి, భీమవరం, ఆకివీడు, పాలకోడేరు, అత్తిలి, మొగల్తూరు, పెంటపాడు, ఏలూరు, జంగారెడ్డిగూడెం, గణపవరం, నిడమర్రు, తాళ్లపూడి, యలమంచిలి, పోడూరు తదితర మండలాల్లో వివిధ రకాల పంటలు ముంపు నీటిలో చిక్కుకున్నాయి. చెరకు 1,625 ఎకరాల్లో, పత్తి 1,500 ఎకరాల్లో, మొక్కజొన్న 1,000 ఎకరాల్లో, వేరుశనగ 125 ఎకరాల్లో, కందులు 25 ఎకరాల్లో ముంపుబారిన పడినట్లు అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. మంగళవారం సాయంత్రానికి కూడా యనమదుర్రు డ్రెయిన్‌ వరద నీటి ప్రవాహం అధికంగా కొనసాగుతుండటంతో క్షేత్ర స్థాయిలో పంట నష్టం మరింత పెరిగే అవకాశాలున్నాయని రైతులు కలత చెందుతున్నారు. జలవనరుల శాఖ ఎస్‌ఈ రఘునాథ్‌, వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకురాలు గౌసియా బేగమ్‌తో పాటు ఇతర అధికారులు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించారు. ముంపుబారిన పంటల విస్తీర్ణంపై ఎప్పటికప్పుడు నివేదికలు రప్పించుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com