కేటీఆర్ దూకుడుతో కాంగ్రెస్ కు ఇబ్బందులు

తెలంగాణ ఐటి మంత్రి కెటిఆర్ ప్రత్యర్థులను తిట్టడంలో తండ్రిని మించిన తనయుడిగా పేరు సంపాదిస్తున్నారు. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఆయన గత కొంత కాలంగా చేస్తున్న పరుష వ్యాఖ్యలతో చేస్తున్న పదునైన విమర్శలు ప్రతిపక్ష పార్టీలకు వరంగా మారుతున్నాయి. దాంతో వారు మరింత దూకుడుగా కేసీఆర్ కుటుంబంపై విమర్శలు, ఆరోపణల దాడితో తెలంగాణాలో రాజకీయాలను బాగా వేడెక్కిస్తున్నారు. సన్నాసులు, చవటలు, దద్దమ్మలు, వెధవలు లత్కోర్, లఫంగి, జఫ్ఫా లు ఇలాంటి పదాలు అధికారిక విమర్శనాస్త్రాలుగా మారిపోయాయి.కానీ ఆయా పార్టీల విమర్శలు, ఆరోపణల్లో వాడుతున్న పదజాలాన్ని మాత్రం ప్రజలు తప్పుపడుతున్నారు.వాస్తవానికి తెలంగాణ ఉద్యమ వ్యూహంలో భాగంగా కేసీఆర్ ఇలాంటి పదజాలాన్ని పార్టీల మీద, ఆంధ్రుల మీద విరివిగా వాడేవారు. రాష్ట్రం విడిపోయి తెలంగాణ కు ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టాక ఆయన వైఖరిలో పూర్తిగా మార్పు వచ్చింది. ఉద్యమ వ్యూహంలో ఆంధ్రులను విమర్శించానే తప్ప మరేమి లేదని కడుపులో పెట్టుకుని చూసుకుంటా అంటూ అందరిని సంతృప్తి పరిచేశారు. అయితే రాజకీయ పార్టీల మీద మాత్రం అప్పుడప్పుడు పరుష పదజాలంతో విరుచుకుపడుతూనే వస్తున్నారు. ఆయన తనయుడు మంత్రి కేటీఆర్ విద్యావంతుడిగా విజనరీ నాయకుడిగా ప్రజల్లో మన్ననలు పొందుతున్నారు. కానీ గత కొంత కాలంగా ఆయన వాడుతున్న పదజాలం తీవ్ర విమర్శలకు దారితీస్తుంది. అయితే ఎన్నికల్లో పూర్తి స్థాయిలో ఓట్లు వేసేది పేద మధ్యతరగతి వర్గాల వారే. వారిని ఆకట్టుకోవాలంటే ఈ తరహా పదజాలంతోనే వెళ్లాలనే వ్యూహంతోనే కెటిఆర్ తన నోటికి పని కల్పించి ప్రత్యర్థులపై దాడి చేస్తున్నారన్నది విశ్లేషకుల పరిశీలన.కెటిఆర్ పెద్దా చిన్నా తేడా లేకుండా చేస్తున్న విమర్శలపై కాంగ్రెస్ సీనియర్లు పదేపదే హర్ట్ అవుతున్నారు. ఆ మధ్య కెటిఆర్ సోనియా పై చేసిన విమర్శలు ఎంతో రాద్ధాంతం చేశాయి కూడా. జానారెడ్డి, జీవన్ రెడ్డి, ఉత్తమ్ కుమార్, విహెచ్ వంటి కాంగ్రెస్ సీనియర్ల ను పట్టుకుని చవటలు, సన్నాసులు అంటుంటే వారికి ఈ తరహా దాడిని ఎలా తిప్పికొట్టాల్లో అర్ధం కానీ పరిస్థితి. కేసీఆర్ అంటే తమ సమకాలికుడు కనుక ప్రతి దాడికి దిగే వారు కేటీఆర్ ఎలా చూసినా రాజకీయాల్లో అతి పిన్నవయస్కుడు. ఆయనపై పరుష పదజాలం తమ పెద్దరికాన్ని చిన్నబుచ్చుతుంది. మరి ఎలా అనుకుంటే ఇప్పుడు రేవంత్ తప్ప వారికి మరో నేత కనిపించడం లేదు. కేటీఆర్ దూకుడుకు కరెక్టుగా జవాబు చెప్పేది రేవంత్ మాత్రమే అని ఫిక్స్ అయినా ఆయన్ను ప్రోత్సహిస్తే అసలుకే ఎసరు వస్తుందన్న భయం వెంటాడుతుంది. మరి దీనికి పరిష్కారం ఏమిటన్న ఆలోచనలో ఉన్నారట హస్తం నేతలు. ఇది ఇలా ఉంటే ఈ నోటి దూల అస్త్రం ఎంతవరకు రాబోయే ఎన్నికల్లో గులాబీ పార్టీని కాపాడుతుందో వేచి చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com