సింగరేణిలో నిలిచిన బొగ్గు ఉత్పత్తి

ఖమ్మంలో కురుస్తున్న భారీ వర్షాలు, ఎగువ నుంచి వరద ప్రవాహంతో భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. భద్రాద్రి జిల్లా ఇల్లెందు డివిజన్‌లో రాత్రి నుంచి ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది. వర్షం కురుస్తుండడంతో ఇల్లెందు, కోయగూడెం ఓపెన్‌ కాస్ట్‌లలో బొగ్గు ఉత్పత్తి పనులు నిలిచిపోయాయి. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలకు దుమ్ముగూడెం మండలం చిన్నగుబలమడుగు వద్ద రోడ్డుపైకి వర్షపు నీరు చేరింది. దీంతో ఏడు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.మరోవైపు రెండు రోజులుగా కురుస్తు్న్న భారీ వర్షాల కారణంగా సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోయింది. పలు చోట్లు గనుల్లోకి వరద నీరు చేరడంతో బొగ్గు ఉత్పత్తి పూర్తిగా నిలిపేశారు. వర్షాల కారణంగా సుమారుగా 95 టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయిందని సింగరేణి అధికారులు తెలిపారు. కొత్తగూడెం, అన్నపురెడ్డిపల్లి, లక్ష్మిదేవి పల్లి, జూలూరుపాడు మండలాల్లో సింగరేణి గనుల్లోకి వరద నీరు చేరిందని వెల్లడించారు.భారీ వర్షాల కారణంగా పలుచోట్ల రహదారులు దెబ్బతినడం కూడా బొగ్గు ఉత్పత్తికి అవరోధంగా మారింది. మరోవైపు.. వర్షాల కారణంగా విద్యుత్ డిమాండ్ భారీగా తగ్గుముఖం పట్టడం గమనార్హం. 10 రోజుల కిందట రోజుకు విద్యుత్ డిమాండ్ 9 వేల మెగావాట్లకు పైగా ఉండగా.. ప్రస్తుతం అది 6 వేల మెగావాట్లకు పడిపోయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com