పాపం బాల్యం..

యాదగిరి గుట్ట.. ఈ పేరు చెప్పగానే.. టక్కున శ్రీలక్మీనరసింహస్వామి ఆలయం గుర్తుకొస్తుంది. కానీ ప్రస్తుతం.. ఆలయానికి బదులు.. చిన్నారుల వ్యభిచార క్షేత్రాన్ని స్ఫురిస్తోంది. పాలుగారే.. వయసులోనే.. పసిపిల్లలకు సెక్స్ పాఠాల బోధన. పట్టుమని పదేళ్లు కూడా లేకుండానే పడుపు రొంపిలోకి వచ్చేయడం. ఇక్కడ నిత్యకృత్యం. మొత్తంగా అందమైన బాల్యం వ్యభిచార బంకర్లలో వాడిపోతోంది. కృత్రిమ పెద్దరికంతో తల్లడిల్లిపోతోంది. బాల్యం అందం, అమాయకత్వంల కలబోత. జీవితంలో అత్యంత అదృష్టవంతమైన సందర్భం అంటే.. చీకూచింతా లేకుండా గడిచిపోయిన బాల్యమే. అయితే.. యాదగిరిగుట్టలోని వ్యభిచార గృహాల నిర్వాహకులు ఈ అందానికి, అదృష్టానికి పలువురు బాలలను దూరం చేశారు. అంతేనా.. ముక్కుపచ్చలారని పిల్లలపై మాటల్లో వర్ణించలేని దారుణాలకు బరితెగించారు. పసి దేహాలను పడుపు వృత్తిలోకి నెట్టారు. యాదగిరిగుట్టలో పోలీసులు రక్షించిన చిన్నారుల గాథలు వింటే హృదయం ద్రవించిపోతుంది. ముక్కుపచ్చలారని పిల్లల శరీరాలతో వ్యాపారం కోసం సాగిన దారుణాలను వర్ణించేందుకు మాటలు వెతుక్కోవాల్సిన పరిస్థితి. డబ్బు కోసం పసివాళ్ల మానప్రాణాలతో యథేచ్ఛగా సాగిన రాక్షస క్రీడ సగటు మనిషిని కలచివేస్తోంది. యాదగిరిగుట్టలో పసిపిల్లలపై అరాచకాల పర్వం చాలాకాలంగా సాగిపోతున్న తంతే. పోలీసుల ఉదాసీనత వల్లే ఈ దందాకు చెక్ పడలేదు. ఇక రాజకీయ నేతల సపోర్టు సైతం ఉన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఏ దశలోనూ బాధితులను ఆదుకునేందుకు సరైన చర్యలే లేకుండాపోయాయి. ఫలితంగా చిన్నారుల జీవితాలు.. వ్యభిచార కూపంలో కూరుకుపోయాయి.
యాదగిరిగుట్ట శ్రీలక్మీనరసింహాస్వామి నిలయం. పవిత్ర పుణ్యక్షత్రంతో పాటే గుట్టకింద కొన్ని కుటుంబాల వ్యభిచార దందా అభివృద్ధి చెందింది. ఒకటి రెండు ఇళ్లతో మొదలైన పడుపు వృత్తి క్రమంగా పెరుగుతూ వచ్చింది. స్థానికంగా వ్యభిచారం వేళ్లూనుకుపోయింది. రాను రాను స్వామి వారి ప్రతీష్ట కంటే వీరి చరిత్రే ఎక్కవగా చెప్పుకునే స్దాయికి వెళ్లిపోయింది. కాలం గడుస్తున్న కొద్ది కుల వృత్తి కాస్తా కమర్షియల్ గా తయారైంది. అసాంఘిక కార్యాకలాపాలకు ఈ ప్రాంతం అడ్డాగా మారింది. పాత గుట్టకు వెళ్లేదారిలో వ్యభిచార గృహాలు దశాబ్దాల కాలంగా ఉన్నాయి. గతంలో ఇక్కడ వ్యభిచారం నివారించేందుకు గతంలో కొన్ని ప్రయత్నాలు జరిగినా ఫలితంలేదు. పిల్లల క్రయవిక్రయాలు యథేచ్ఛగా సాగిపోతుంటాయి. ప్రస్తుతం యాదగిరిగుట్టలో వ్యభిచార రొంపిలో కూరుకుపోయిన పలువురు చిన్నారులను పోలీసులు రక్షించారు. రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డవారినే కాక పక్కా ఆధారాలతోనూ దోషులుగా తేలిన వారిని అరెస్ట్ చేశారు. ఇలాంటి రైడింగ్స్ గతంలోనూ సాగాయి. అయితే.. కొద్ది రోజుల్లోనే పరిస్థితి షరామామూలైపోయేది. అన్ని స్థాయిల్లోని ఉదాసీనత, నిర్లక్ష్యం.. పిల్లల జీవితాలను బలితీసుకుంది. చిన్నారులను వ్యభిచారిణులుగా మార్చేసింది. ఏదేమైనా ప్రభుత్వం ఈ అంశాన్ని సీరియస్ గా పరిగణించి.. ఇలాంటి ఉదంతాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అంతా కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com