మాతృత్వానికి అండగా నిలచిన ఛత్తీస్ ఘడ్ పోలీసులు

నిత్యం కాల్పుల మోతలు…అడుగుతీసి అడుగేస్తే చాలు పొంచివున్న మంతుపాతరల ప్రమాదాలు.. ఆదమరిస్తే చాలు ఆకస్మికంగా విరుచుకుపడే శత్రువుల వ్యూహాత్మక దాడులు..ఒక్క మాటలో చెప్పాలంటే అనుక్షణం అప్రకటిత యుద్దవాతావరణం. ప్రాణాలను ఫణంగా పెట్టి చేసే కత్తిమీద సాము లాంటి ఉద్యోగం. ఇటువంటి ప్రతీకూల పరిస్థితుల్లో సైతం పచ్చని అడవుల్లో మానవత్వం వెల్లివిరిసింది.తుపాకులను ఎక్కుపెట్టే పోలీసులు ఆపదలో ఉన్న అమ్మతనానికి అండగా నిలిచారు.విలువైన రెండు ప్రాణాలు కాపాడారు… అందరి చేత శబాష్ అనిపించుకుంటున్నారు. ఈ ఘటన నిత్యం పోలీసులు, మావోల కాల్పులతో దద్దరిల్లే ఛత్తీస్ గడ్ రాష్ట్రం కొండగావ్ అటవీ ప్రాంతంలో చోటుచేసుకుంది. కొండగావ్ జిల్లా హడేలి గ్రామానికి చెందిన గిరిజనుడు పులిరాం భార్య రుక్మిణి నిండు గర్భిణి. నెలలు నిండటంతో పురిటి నొప్పులతో అల్లాడిపోయింది. మారుమూల గిరిజన గ్రామం కావడం మరోవైపు భారీ వర్షం కురుస్తుండటంతో ఏంచేయాలో పాలుపోని స్థితిలో ఉన్న గిరిజన దంపతులకు సమీప అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీస్ అసిస్టెంట్ కమాండర్ ప్రవీణ్ కుమార్ అండగా నిలిచారు. రహదారి సౌకర్యం కూడా సరిగా లేని గ్రామం నుండి రుక్మిణిని ఆస్పత్రికి తరలించాలంటే 7 కిలోమీటర్లు నడిచి వెళ్లాల్సిందే. దీంతో తన బలగాలను అప్రమత్తం చేసిన ప్రవీణ్ వెంటనే స్ట్రెచర్ తీసుకువచ్చి పోలీసుల ఆధ్వర్యంలో ఆమెను అటవీ మార్గంలో ఏడు కిలోమీటర్ల దూరం మోసుకెళ్లి ఆర్మీ అంబులెన్స్ ద్వారా క్షేమంగా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో సురక్షితంగా ప్రసవం జరగడంతో ప్రస్తుతం తల్లీ బిడ్డ క్షేమంగా ఉన్నారు. మానవత్వంతో స్పందించి గిరిజన మహిళ కుటుంబానికి అండగా నిలిచిన పోలీసుల సేవానిరతి ఇపుడు అందరి ప్రశంసలు అందుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com