అవకతవకలకు చెక్ పడాలి

కరీంనగర్ కార్పోరేషన్ పరిధిలో పలు అభివృద్ధి పనులు జోరుగా సాగుతున్నాయి. నగరాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దేందుకు అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది. ఇంతవరకూ బాగానే ఉన్నా పనులు జరిపిస్తున్న కాంట్రాక్టర్లు మాత్రం నాణ్యతకు ప్రాధాన్యతనివ్వడంలేదని పలువురు విమర్శిస్తున్నారు. కొన్ని చోట్ల నిబంధనలు పట్టించుకోవడంలేదన్న ఆరోపణలు సైతం వెల్లువెత్తుతున్నాయి. నగరంలో ప్రధాన రహదారులను విస్తరించి, సుందరంగా తీర్చిదిద్దేందుకు పనులు కొన్నిరోజులుగా సాగుతున్నాయి. రహదారులకు ఇరువైపులా డ్రైనేజీలు, ఫుట్‌పాత్‌ల నిర్మాణం, రోడ్డు మధ్యలో డివైడర్ల నిర్మాణ పనులు చేస్తున్నారు. మొదటి విడతలో 7.5 కిమీ మేర పనులు పూర్తయ్యాయి. ఈ నిర్మాణాలకు తుది మెరుగులు దిద్దాల్సి ఉంది. ఇందులో నగరపాలక తరఫున ఫుట్‌పాత్‌పై టైల్స్‌ నిర్మించాల్సి ఉంది. ఇక డక్ట్‌ల్లో ఎర్రమట్టి పోసి పూల మొక్కలు నాటాలి. మొదటి విడత చేపట్టిన పనుల్లో డ్రైనేజీలు, పక్కనే డక్ట్‌లు నిర్మించారు. వీటిలో కేబుల్స్‌, తాగునీటి పైపులైన్లు వేయాలని నిర్ణయించారు. డక్ట్ ల్లో మట్టి పోసే పనిని కొందరు కాంట్రాక్టర్లకు అప్పగించారు. అధికారుల సూచనలకు తగ్గట్లుగా కొంతమంది గుత్తేదారులు నాణ్యమైన మట్టి నింపారు. మరికొందరు మాత్రం నిబంధనలు పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు అంటున్నారు. కూడళ్ల దగ్గర తొలగించిన మట్టి, రాళ్లు, రాప్పలు తీసుకొచ్చి నింపేస్తున్నారని విమర్శిస్తున్నారు. గళ్లమొరం కూడా నింపుతున్నారని ఆరోపిస్తున్నారు. కోర్టు దగ్గర నుంచి ఎస్‌ఆర్‌ఆర్‌ కళాశాల వరకు ఇదేవిధంగా పోస్తున్నారని ఇలాంటి మట్టిలో మొక్కలు బతకవని వ్యాఖ్యానిస్తున్నారు.

కరీంనగర్ లో ప్రధాన రహదారులకు ఇరువైపులా మురుగు కాల్వలపై టైల్స్‌ నిర్మించేందుకు కార్పోరేషన్ బాధ్యత తీసుకుంది. ఈ క్రమంలో రూ.2.13 కోట్లతో టైల్స్‌ వేయడం, కాల్వలను శుభ్రం చేయడం, కాల్వలపై పూడిక తీసుకోవడానికి వీలుగా ఛాంబర్లు నిర్మించడం, డక్ట్‌ల్లో మొక్కలు నాటేలా మట్టిపోయడం వంటి చేసేందుకు అధికారులు టెండర్లు పిలిచారు. పనులను ఎప్పుడో పూర్తిచేయాల్సి ఉంది. అయితే పలుచోట్ల నత్తనడకన సాగుతున్నాయి. మరికొన్ని చోట్ల అసంపూర్తిగా ఉన్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికార యంత్రాంగం స్పందించి అభివృద్ధి పనులు నిబంధనలకు అనుగుణంగా సాగేలా చర్యలు తీసుకోవాలని అంతా కోరుతున్నారు. డక్ట్‌ల్లో కొత్త మట్టి పోసేలా చూడాలని అంటున్నారు. వాస్తవంగా డక్ట్ ల్లో కొత్త మట్టే పోయాలి. దీనికి క్యూబిక్‌ మీటర్‌ చొప్పున నగరపాలక అధికారులు లెక్కకట్టి ఇస్తారు. కొన్నిచోట్ల ఎర్రమట్టిని ఎలగందుల నుంచి తీసుకొచ్చి పోశారు. నిజానికి ఒక ట్రాక్టర్‌ ధర సుమారు రూ.1200 ఉంటుంది. తొలగించిన మట్టి అయితే రవాణ ఖర్చు కింద రూ.400 ఉంటుంది. దూర ప్రాంతం నుంచి తీసుకొచ్చి పోయడం కంటే నగర కూడళ్ల వద్ద తొలగించిన మట్టిని తీసుకొస్తే లెక్క తప్పదనే ధీమాతో ఉన్నారు. ఇలాంటి అక్రమాలపై అధికారులు ఉక్కుపాదం మోపాలని అవకతవకలకు ఆస్కారం లేకుండా అభివృద్ధి పనులు సాగేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com