బస్సుకు నష్టం.. కష్టం (హైదరాబాద్)

అధికారుల అత్యుత్సాహం, పర్సంటేజీల వ్యవహారం, ప్రైవేటు సంస్థలపై మమకారం.. వంటి కారణాలతో ఆర్టీసీపై అడ్డగోలు భారం పడుతోంది. సంస్థకు ఎటువంటి సంబంధమూ లేని అద్దెబస్సుల బీమా వ్యవహారం మరింత నష్టాన్ని కలిగిస్తోంది. దీంతో సంస్థనే నమ్ముకుని అహరం శ్రమిస్తున్న కండక్టర్లు, డ్రైవర్లు, శ్రామికులు, మెకానిక్‌లే ఆందోళన చెందుతున్నారు. ఉద్యోగాలు ఉంటాయో ఊడుతాయోనన్న ఒత్తిడికి గురవుతున్నారు. సంస్థపై మోపుతున్న అనవసరపు భారాల్లో అద్దె బస్సుల థర్డ్‌ పార్టీ బీమా ఒకటి. నిజంగా ఇలాంటి భారాలను ఆర్టీసీ మోయాల్సిన అవసరం లేదు. చర్చలు, అగ్రిమెంట్ల సందర్భంలోనే దీనిని తిరస్కరించవచ్చు.
కానీ… అధికారులు అలాంటి తిరస్కారాలకు ఆస్కారం లేకుండా చక్రం తిప్పుతున్నారు. అద్దె బస్సుల బీమా భారాన్ని సంస్థ మీదే వేసేస్తున్నారు. ఫలితంగా ఒక్క థర్డ్‌ పార్టీ బీమా ద్వారానే సంస్థపై ఏటా రూ.18.42 కోట్ల భారం పడుతోంది. ప్రస్తుతం ఆర్టీసీలో మొత్తం 2834 అద్దె బస్సులున్నాయి. ఇవి ప్రైవేటు సంస్థలు, వ్యక్తులకు చెందిన బస్సులైనందున… థర్డ్‌ పార్టీ బీమా చేయాలన్న నిబంధన ఉంది. ఆర్టీసీ సొంత బస్సులకు మాత్రం థర్డ్‌ పార్టీ బీమా నుంచి మినహాయింపు ఉంది. ఆర్టీసీ సొంత బస్సుల వల్ల జరిగే ప్రమాదాల్లో మృతి చెందినవారి కుటుంబాలకు, క్షతగాత్రులకు ‘మోటార్‌ యాక్సిడెంట్‌ క్లెయిమ్స్‌ ట్రైబ్యునల్‌(ఎంఏసీటీ)’ ఇచ్చే తీర్పుల ఆధారంగా సంస్థ ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తుంటుంది.
కానీ, అద్దె బస్సులకు చేసే థర్డ్‌ పార్టీ బీమా సొమ్మును మాత్రం ఆర్టీసీయే చెల్లిస్తోంది. యజమానులు ముందుగా తమ అద్దె బస్సులకు థర్డ్‌ పార్టీ బీమా చేయిస్తారు. ఒక్కో బస్సుకు ఏడాదికి రూ.65 వేల చొప్పున ప్రీమియంను బీమా సంస్థకు చెల్లిస్తున్నారు. అనంతరం ఈ ప్రీమియం సొమ్మును రీ-యింబర్స్‌ చేయాల్సిందిగా ఆర్టీసీకి దరఖాస్తు పెట్టుకుంటున్నారు. దాంతో సంస్థ ఆ సొమ్మును యజమానులకు రీ-యింబర్స్‌ చేస్తోంది. ఒక్కో బస్సుకు రూ.65 వేల చొప్పున యజమానులకు చెల్లిస్తోంది. అంటే… 2834 బస్సులకు ఏటా రూ.18.42 కోట్ల మేర సొమ్మును చెల్లిస్తున్నారు. బస్సులను అద్దెకు తీసుకునే సందర్భంలోనే థర్డ్‌ పార్టీ బీమా ప్రీమియాన్ని చెల్లించేలా అగ్రిమెంట్‌లో నిబంధన పెడుతున్నారు. ఇందుకు సంస్థలోని ఈడీలు, ఇంజనీరింగ్‌ విభాగ అధికారులు సహకరిస్తున్నారు. అసలు ఈ నిబంధన పెట్టేలా యజమానులకు అవగాహన కల్పించింది కూడా అధికారులేనన్న ఆరోపణలున్నాయి. ఇలా నిబంధన పెట్టించినందుకు… అధికారులకు అందాల్సిన పర్సంటేజీలు, మామూళ్లు అందుతున్నాయి.
పైగా అద్దె బస్సుల్లో ఎక్కువగా ఆర్టీసీ, రవాణా, పోలీసు శాఖల అధికారులకు చెందినవే ఉండడం గమనార్హం. సంస్థలోని ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లు, ఇంజనీరింగ్‌, పబ్లిక్‌ రిలేషన్స్‌, ట్రాఫిక్‌ విభాగాలు, రవాణా శాఖ, పోలీసు శాఖ అధికారులకు అద్దె బస్సులున్నాయి. ఇవన్నీ బినామీ పేర్లతో కొనసాగుతున్నాయి. దాంతో అధికారులే దగ్గరుండి మరీ నిబంధనలను పెట్టిస్తున్నారు.
వాస్తవానికి బీమా ప్రీమియంను చెల్లించబోమంటూ ఆర్టీసీ తిరస్కరించడానికి ఆస్కారముంది. ప్రైవేటు వాహనాల ప్రీమియంను తామెందుకు భరించాలంటూ ప్రశ్నించవచ్చు. కానీ… ఇలాంటి అవకాశాలు లేకుండా అధికారులే అన్ని రకాలుగా సహకరిస్తున్నారు. ఒకవేళ కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదిత ‘మోటారు వాహన చట్టం సవరణ బిల్లు-2016’ ఆమోదం పొందితే థర్డ్‌ పార్టీ బీమా ప్రీమియం రూ.లక్షన్నరకు పెరిగే అవకాశం ఉంది. అప్పుడు ఆర్టీసీ ఒక్కో బస్సుకు రూ.లక్షన్నర చొప్పున కట్టాల్సిందే. అప్పుడు సంస్థపై మరింత భారం పడే అవకాశముంది. ఈథర్డ్‌ పార్టీ బీమా ప్రీమియంపై రవాణా శాఖ మంత్రి, ముఖ్యకార్యదర్శి దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com