బాధ్యతలకు వెనకడుగు!

పంచాయతీ పాలకవర్గాల పదవీకాలం ముగియడంతో ప్రభుత్వం ప్రత్యేకాధికారులను నియమించి పల్లెపాలనను కొనసాగించాలని నిర్ణయించింది తెలంగాణ సర్కార్. కొత్త పంచాయతీరాజ్‌ చట్టం ప్రకారం ప్రతి పంచాయతీకి ఒక ప్రత్యేకాధికారిని నియమించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించారు. అయితే పలు పంచాయతీల్లో ప్రత్యేకపాలన సాగడంలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 48 పంచాయతీల్లో ఈ సమస్య ఉందని పలువురు అంటున్నారు. అభివృద్ధిలో ప్రజలను భాగం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం తండాలను, శివారు పల్లెలను ప్రత్యేక పంచాయతీలుగా ఏర్పాటు చేసింది. ఈ నెల 2న తండావాసులు, కొత్తగా ఆవిర్భవించిన పంచాయతీల ప్రజలు ఆవిర్భావాన్ని సంబరంగా నిర్వహించుకున్నారు. అయితే విద్యుత్తు శాఖ సిబ్బంది ప్రత్యేకాధికారులుగా నియమితులైన పంచాయతీల్లో ఆ సంతోషం ప్రస్తుతం మాయమైంది. ప్రారంభం రోజున తెరిచిన కార్యాలయాలు 20 రోజులైనా తెరుచుకోలేదని స్థానికులు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా కొత్తగా ఏర్పాటైన పంచాయతీలకు జనాభా ప్రాతిపదికన మంజూరైన 14వ ఆర్థిక సంఘం నిధులను వచ్చాయి. వాటి వినియోగానికి ప్రత్యేకాధికారులు, కార్యదర్శులు సంయుక్తంగా సమీప బ్యాంకుల్లో పీడీ ఖాతాలు తెరవాల్సి ఉంది. కానీ విద్యుత్తు శాఖ సిబ్బంది బాధ్యతలు స్వీకరించకపోవడంతో 48 పంచాయతీలలో పీడీ ఖాతాలు తెరిచే ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదని సమాచారం. దీంతో అభివృద్ధి కుంటుపడుతుందని స్థానికులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
ప్రస్తుతం జిల్లాలో 533 పంచాయతీలు ఉన్నాయి. అయితే పంచాయతీల సంఖ్యకు తగ్గట్టుగా అధికారులు లేరు. దీంతో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. అత్యవసర విభాగాలైన విద్యుత్తు, వైద్య శాఖల సిబ్బందిని సైతం ప్రత్యేకాధికారులుగా నియమించారు. విద్యుత్తు సిబ్బంది ప్రత్యేక బాధ్యతలతో తమ శాఖలోని విధులకు ఆటంకం కలుగుతుందని ఉన్నతాధికారులకు విన్నవించుకున్నారు. దీంతో పాలనాధికారి వారికి సహాయకులుగా రెవెన్యూ అధికారులను సహాయ ప్రత్యేకాధికారులుగా నియమించారు. వారిని కేవలం భూ దస్త్రాల ప్రక్షాళన పూర్తయ్యేంతవరకు మాత్రమే ప్రత్యేక బాధ్యతలు చేపట్టాలని సూచించారు. ప్రస్తుతం భూ దస్త్రాల ప్రక్షాళన తుది దశకు చేరుకుందని, పూర్తికాగానే రెవెన్యూ అధికారులకే పూర్తిస్థాయిలో ప్రత్యేకాధికారుల బాధ్యతలను అప్పగిస్తామని పేర్కొన్నారు. పలు సడలింపులు ఇచ్చినా విద్యుత్తు సిబ్బంది ప్రత్యేక బాధ్యతల స్వీకరణకు మొగ్గుచూపడంలేదు. పంచాయతీల్లో ప్రత్యేక పాలన ప్రారంభమై ఇరవై రోజులు గడిచినా కొందరు బాధ్యతలకు దూరంగా ఉన్నారు. ఉద్యోగుల కారణాలు ఎలా ఉన్నా.. జిల్లాలో అభివృద్ధి ప్రభావితం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. గ్రామాల్లోని సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com