మురళీధరరావుతో అళగిరి చర్చలు

కరుణానిధి మరణానంతరం డీఎంకేలో ఆధిపత్య పోరు మొదలైన దాఖలాలు కనిపిస్తున్నాయి. కరుణ అనంతరం పార్టీ పగ్గాలు ఎవరికి? అనే అంశంపై చర్చ లేకున్నా.. కరుణకు స్టాలిన్ వారసుడు అనే అభిప్రాయాలు గట్టిగానే ఉన్నా, తను కూడా రేసులో ఉన్నానని కరుణానిధి మరో తనయుడు అళగిరి కూడా ప్రకటించుకోవడంతో ఈ వ్యవహారం రసవత్తరంగా మారింది. తనకు కూడా డీఎంకేలో గట్టి మద్దతు ఉందని, తను పార్టీ బాధ్యతలను తీసుకోగలనని అళగిరి ప్రకటించుకున్నారు. ఒకవైపు రేపు డీఎంకే మీటింగ్ జరగనుందని, స్టాలిన్‌ను పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకోనున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో అళగిరి రంగంలోకి దిగారు. గతంలో కూడా కరుణానిధి వారసత్వం విషయంలో అళగిరి, స్టాలిన్‌ల మధ్యన పోరు జరిగింది. అయితే అప్పుడు అళగిరిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఇప్పుడు కూడా అళగిరి డీఎంకేలో లేనట్టే. కానీ ఇప్పుడు తనకు పార్టీలో మద్దతు ఉందని అళగిరి అంటున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ రంగంలోకి దిగిందనే వార్తలు వస్తున్నాయి. కరుణానిధి తనయుడు అళగిరితో బీజేపీ నేత మురళీధరరావు సమావేశం కావడం ఒకింత ఆసక్తిదాయకంగా మారింది. దాదాపు 40 నిమిషాల పాటు వీరిద్దరి చర్చలు సాగినట్టుగా తెలుస్తోంది. అళగిరిని బీజేపీలోకి ఆహ్వానిస్తున్నారా? అనే అంశంపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. డీఎంకే పరిణామాలతో అసహనభరితుడు అయిన అళగిరి కమలం పార్టీ తీర్థం పుచ్చుకుంటారా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com