ఆప్‌నకు కేజ్రీవాల్‌కు సన్నిహితుడు అశుతోష్‌ రాజీనామా ఆయన రాజీనామాను అంగీకరించడం ఈ జీవితంలో సాధ్యంకాదు: కేజ్రీవాల్‌

కేజ్రీవాల్‌కు సన్నిహితుడు, పార్టీ సీనియర్‌ నేత అయిన అశుతోష్‌ బుదవారం ఉదయం ఆప్‌నకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రతి ప్రయాణానికి ముగింపు ఉంటుందని, ఆప్‌తో నా ప్రయాణం ముగిసిందని, పూర్తి వ్యక్తిగత కారణాల వల్ల పార్టీ నుంచి తప్పుకొంటున్నానని అశుతోష్‌ ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు.ఆమ్‌ ఆద్మీ పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరైన అశుతోష్‌ పార్టీకి రాజీనామా చేయడంపై ఆప్‌ కన్వీనర్‌, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ స్పందించారు. ఆయన రాజీనామాను అంగీకరించబోమని, అది ఈ జీవితంలోనే సాధ్యంకాదని అన్నారు. ‘మీ రాజీనామాను ఎప్పుడైనా ఎలా అంగీకరిస్తాం? ఈ జన్మలో అది కుదరదు’ అని కేజ్రీవాల్‌ ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. ‘సర్‌, మేమేంతా మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాం’ అంటూ మరో ట్వీట్‌ చేశారు. మరో ఆప్‌ నేత గోపాల్‌ రాయ్‌ కూడా రాజీనామా అంశంపై ట్విటర్‌లో స్పందించారు. ‘అశుతోష్‌ నిర్ణయం బాధాకరం. ఈ విషయంపై కలిసి చర్చిస్తాం’ అని ట్వీట్‌ చేశారు. ఆయన రాజీనామా వెనక్కి తీసుకునేలా పార్టీ ఆయనను ఒప్పించే ప్రయత్నం చేస్తుందని మరో నేత సంజయ్‌ సింగ్‌ పేర్కొన్నారు. మీడియా మిత్రులు తన ప్రైవసీని కాపాడాలని, ఇంతకంటే దీనిపై ఏమీ మాట్లాడాలనుకోవట్లేదని పేర్కొన్నారు. గతంలో టీవీ జర్నలిస్ట్‌గా పనిచేసిన అశుతోష్‌ 2014లో ఆప్‌లో చేరారు. అయితే అశుతోష్‌ రాజీనామా నిర్ణయం అకస్మాత్తుగా తీసుకున్నది కాదని, ఆయన ఎప్పటి నుంచో అనుకుంటున్నారని సంబంధిత వర్గాల నుంచి సమాచారం. ఇటీవల రాజ్యసభ అభ్యర్థుల విషయంలో కేజ్రీవాల్‌ తీసుకున్న నిర్ణయంపై అశుతోష్‌ అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com