ఏపీలో అడుగు పెట్టే అవకాశాన్ని కోల్పోయిన సీబీఐ

0

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీబీఐకి పెద్ద షాక్ ఇచ్చింది. ఇకపై రాష్ట్రంలో అడుగు పెట్టాలంటే ప్రభుత్వం దగ్గర అనుమతి తప్పనిసరి చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. తనిఖీలు, దర్యాప్తు చేసేందుకు సీబీఐకి గతంలో ఇచ్చిన అనుమతి పత్రాన్ని వెనక్కు తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఈ ఉత్తర్వులతో ఇకపై సీబీఐ అధికారులు రాష్ట్రంలో కొత్తగా ఎలాంటి కార్యకలాపాలూ స్వతంత్రంగా నిర్వహించలేరు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల అవినీతి, అక్రమాలపై తనిఖీలు చెయ్యాలన్నా రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సిందే. రైల్వే వ్యవహారాల్లో మినహా.. ఇతర చోట్ల ఎలాంటి సోదాలు చెయ్యాలన్నా షరతులు వర్తిస్తాయి. కేంద్రం సీబీఐతో పాటూ స్వతంత్ర సంస్థలన్ని రాజకీయ స్వార్థం కోసం ఉపయోగించుకుంటోందని చంద్రబాబు ఆరోపిస్తున్నారు. టీడీపీ నేతలే టార్గెట్‌గా ఐటీ సోదాలు కూడా జరిగాయి. దీంతో కేంద్రంపై గుర్రుగా ఉన్న టీడీపీ సర్కార్.. గతంలోనే ఈ సోదాలకు రాష్ట్ర పోలీసులు భద్రత కల్పించాల్సిన అవసరం లేదని చెప్పింది. ఇప్పుడు రాష్ట్రంతో ఏదో లింకు పెట్టి సీబీఐ ద్వారా ఇరుకున పెట్టే ప్రయత్నాలు జరుగుతాయని ఏపీ సర్కార్ భావించందట.. అందుకే సీబీఐకు షాకిస్తూ ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

ఢిల్లీ స్పెషల్ పోలీసు ఎస్టాబ్లిష్‌మెంట్ చట్టం-1946 ప్రకారం కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)ను ఏర్పాటు చేసింది. ఇది ఢిల్లీ పరిధిలో తన అధికారాలను వినియోగించుకోవచ్చు. ఒకవేళ బయటి రాష్ట్రాలలో దాడులు, దర్యాప్తు జరపాలనుకుంటే అక్కడి ప్రభుత్వాల అంగీకారం తప్పనిసరి. ఇందుకోసం జనరల్ కన్సెంట్ (సాధారణ సమ్మతి) నోటిఫికేషన్‌ను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ నోటిఫికేషన్ విడుదలైతేనే ఆయా రాష్ట్రాల్లో సీబీఐ ఎంట్రీకి గ్రీన్ సిగ్నల్ లభిస్తుంది. లేదంటే అంతే. అయితే, ఇలా ఇచ్చిన నోటిఫికేషన్‌ను వెనక్కి తీసుకునే వెసులుబాటు కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది. ఒకటి రెండు రాష్ట్ర ప్రభుత్వాలు తప్ప దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాలు జనరల్ కన్సెంట్ నోటిఫికేషన్ ఇచ్చాయి. ఏపీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు తన సమ్మతిని తెలియజేస్తూ వస్తోంది. చివరిసారి ఈ ఏడాది ఆగస్టులోనే సాధారణ సమ్మతి నోటిఫికేషన్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, తాజాగా, సీబీఐ కేంద్రం చేతిలో కీలుబొమ్మగా మారిందని, దాని పనితీరు మందగించిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఈ క్రమంలో సీబీఐ తనకు దఖలు పడిన అధికారాలను సమర్థంగా వినియోగించుకోలేకపోతోందని సీనియర్ న్యాయవాది ఒకరు రాష్ట్ర ప్రభుత్వానికి వినతి పత్రం ఇచ్చారు. సీబీఐతో పోలిస్తే రాష్ట్ర సంస్థలే మెరుగ్గా, ఆధునికంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర పరిధిలో జరిగే నేరాలను దర్యాప్తు చేసే సమర్థత రాష్ట్ర సంస్థలకే ఉన్నందున సీబీఐని ఆశ్రయించాల్సిన పనిలేదని ఆయన అభిప్రాయపడ్డారు. గతంలో జారీ చేసిన సమ్మతి నోటిఫికేషన్‌ను వెనక్కి తీసుకోవాలని కోరారు. సీనియర్ న్యాయవాది ఇచ్చిన వినతి పత్రంపై రాష్ట్ర ప్రభుత్వం సుదీర్ఘంగా చర్చించింది. రాజకీయ కక్షలతోనే ఏపీలో వరుసగా దాడులు జరుగుతున్నాయని మంత్రివర్గం అభిప్రాయపడింది. దీంతో ఆగస్టులో జారీ చేసిన సమ్మతి నోటిఫికేషన్‌ను వెనక్కి తీసుకోవాలని నిర్ణయించింది..

Share.

About Author

Leave A Reply