వరదలకు 774 మంది మృతి

ఈఏడాది వర్షాకాలం ప్రారంభం నుంచి ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా 774 మంది మృత్యువాతపడినట్టు కేంద్ర హోమ్ శాఖ సోమవారం ప్రకటించింది. దేశంలోని ఏడు రాష్ట్రాలను భారీ వర్షాలు, వరదలు ముంచెత్తాయని తెలిపింది. జాతీయ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ సెంటర్‌ వెల్లడించిన వివరాల ప్రకారం.. భారీ వర్షాలు, వరదల కారణంగా కేరళలో అత్యధికంగా 187 మంది మృతి చెందగా, ఉత్తరప్రదేశ్‌లో 171, పశ్చిమ్‌బంగలో 170, మహారాష్ట్రల్లో 139, గుజరాత్‌లో 52, అసోంలో 45 మంది, నాగాలాండ్‌లో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే వరదల్లో చిక్కుకుని 27 మంది గల్లంతవగా వీరిలో అత్యధికంగా కేరళలో 22 మంది, పశ్చిమ బెంగాల్‌లో ఐదుగురు ఉన్నారు. భారీ వర్షాల వల్ల జరిగిన వివిధ ఘటనల్లో 245 మంది గాయపడ్డారు. ఉత్తరప్రదేశ్‌లో 8, పశ్చిమ్‌బంగలో 8, గుజరాత్‌లో 7, కేరళలో 4, మహారాష్ట్రలో 4 ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయని కేంద్ర హోంశాఖ వివరించింది. మహారాష్ట్రలోని 26 జిల్లాలు, అసోంలో 23, పశ్చిమ్ బెంగాల్‌లో 22, కేరళలో 14, యూపీలో 12, నాగాలాండ్‌లో 11, గుజరాత్‌లో 11 జిల్లాల్లో భారీ వర్షాలు పెను ప్రభావం చూపాయని తెలిపింది. అసోంలో అత్యధికంగా 11.45 లక్షల మంది వరద ప్రభావానికి గురికాగా, 27,552 హెక్టార్ల విస్తీర్ణంలో పంటలు దెబ్బతిన్నాయి. అసోంలో 15 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయని తెలియజేశారు. మరో రెండు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని ఉత్తర్‌ప్రదేశ్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, కేరళ, కర్ణాటక, తమిళనాడు, పశ్చిమ్ బెంగాల్, అసోం, నాగాలాండ్, అరుణాచల్‌ప్రదేశ్, కేరళ సహా 16 రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అధికారులు, ఎన్డీఆర్ఎఫ్ దళాలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. నాలుగు రోజులుగా కేరళ వర్షాలు ముంచెత్తడంతో సగం రాష్ట్రం ముంపునకు గురైంది. వరదలకు 39 మంది ప్రాణాలు కోల్పోగా, వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ఇడుక్కి, వాయనాడ్, కన్నూర్, ఎర్నాకులం, పాలక్కడ్, మలప్పురం జిల్లాలు అతలాకుతలమయ్యాయి. దాదాపు 26 ఏళ్ల తర్వాత ఇడుక్కి రిజ్వాయర్ గేట్లు తెరుచుకున్నాయంటే వరద తీవ్రత ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ 2403 అడుగులు కాగా, సోమవారం ఉదయానికి నీటి మట్టం 2397.84 అడుగుల వద్ద ఉంది. దీని ఐదు గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. కేరళలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించిన కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ… 1924 తర్వాత కేరళలో పరిస్థితి ఇంత దారుణంగా ఉండటం ఇదే తొలిసారని వ్యాఖ్యానించారు. మరోవైపు దక్షిణ కర్ణాటకలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కావేరీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీచేశారు. తమిళనాడులోని 9 జిల్లాలకు కావేరీ ముంపు ముప్పు పొంచి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com