11 నుంచి 16 వరకు సంప్రోక్షణ

తిరుమల శ్రీవారి ఆలయంలో పన్నెండేళ్లకు ఒకసారి నిర్వహించే అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణం ఆగస్టు 11 నుంచి 16 వరకు నిర్వహించనున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన ఏర్పాట్లను టీటీడీ ఇప్పటికే పూర్తిచేసింది. యఙ్ఞ‌ గుండాల ఏర్పాటు, క్యూలైన్ల నిర్మాణ పనులను టీటీడీ ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌, జేఈవో శ్రీనివాసరాజు, ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు అనంతరం అధికారులు, అర్చకులతో సమావేశమై వైదిక క్రతువు నిర్వహణ, భక్తులకు స్వామివారి దర్శన ఏర్పాట్లపై సమీక్షించారు. మహాసంప్రోక్షణకు శనివారం అంకురార్పణం జరుగుతోందని, ఈ రోజున 50 వేల మంది వరకు భక్తులకు, ఆగస్టు 12 నుంచి 15 వరకు రోజుకు 25 నుంచి 35 వేల మందికి మాత్రమే అవకాశం లభిస్తుందని అంచనాకు వచ్చారు. పూర్ణాహుతి జరిగే ఆగస్టు 16 న 18 వేల మందికి మించి దర్శనం కల్పించే అవకాశం ఉండదని భావిస్తున్నారు. ఇలా మహాసంప్రోక్షణం జరిగే ఆరు రోజుల్లో మొత్తం 1.80 లక్షల మందికి అవకాశం ఉంటుందని, పరిమిత సంఖ్యలో దర్శనానికి అనుమతిస్తున్న విషయాన్ని భక్తులు గుర్తించి ప్రణాళిక రూపొందించుకోవాలని అధికారులు సూచించారు. ఆగస్టు 17 నుంచి యథావిధిగా శ్రీవారి దర్శనం ఉంటుందని తెలిపారు. మహా సంప్రోక్షణం సమయంలో భక్తులకు ఎలాంటి టిక్కెట్లు, టోకెన్లు జారీ చేయమని స్పష్టం చేశారు. సర్వదర్శనం మాత్రమే పరిమిత సమయంలో ఉంటుందని, దీనికి కూడా సమయాన్ని బట్టి, సామర్థ్యాన్ని లెక్కించి భక్తులను రోజుకు ఓసారి మాత్రమే క్యూలైనులోకి వదిలి కంపార్టుమెంట్లలో ఉండటానికి అనుమతిస్తామని వివరించారు. తర్వాత క్యూలైన్లను మూసివేసి సమయాన్ని బట్టి మర్నాడు మళ్లీ అనుమతిస్తామని ఈవో వెల్లడించారు. ఇందుకోసం వైకుంఠం-2 నుంచి నారాయణగిరి ఉద్యానవనం, కర్ణాటక సత్రాలు మీదుగా మేదరమిట్ట వరకు క్యూలైన్ ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. యాగశాలలో వైదిక కార్యక్రమాల నిర్వహణ వల్ల దర్శన సమయం తక్కువగా ఉంటుందని, పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతిస్తామని వివరించారు. ఆగస్టు 11న మొదటిరోజు దర్శనానికి సంబంధించి ఆగస్టు 10 అర్ధరాత్రి 12 గంటల తరువాత భక్తులను క్యూలైన్లలోకి అనుమతిస్తామని చెప్పారు. మహాసంప్రోక్షణం సమయంలో పూర్తిగా దర్శనం నిలిపివేయాలని టీటీడీ పాలకమండలి తీసుకున్న నిర్ణయంపై తీవ్ర విమర్శలు చెలరేగాయి. దీంతో సీఎం చంద్రబాబు జోక్యం చేసుకుని వీలును బట్టి పరిమితి సంఖ్యలో దర్శనానికి అనుమతించాలని ఆదేశించడంతో వివాదం సద్దుమణిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com