నిలిచిపోయిన 108 సేవలు

108 వాహనాల సేవలకు అంతరాయం ఏర్పడింది.. డిమాండ్ల సాధన కోసం ఉద్యోగులు ఆందోళన బాటలో ఉన్న సమయంలోనే వారిని తొలగిస్తూ జీవీకే సంస్థ నిర్ణయం తీసుకుంది.. అయితే వీరిని తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నప్పటికి వీరిస్థానాల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు మాత్రం అసలు చేయలేదు.. ఫలితంగా వాహనాల రాకపోకలకు ఇబ్బందులతోపాటు అత్యవసర సమయాల్లో ఉన్న రోగులు ఫోన్‌ చేసినా వాహనాలు పంపించని పరిస్థితి.. అత్యవసర సమయాల్లో ఫోన్‌ చేస్తున్న రోగులకు చివరకు నిరాశే మిగులుతోంది..దీంతో ప్రైవేట్‌ వాహనాల్లో ఆస్పత్రులకు వస్తు న్నారు.. సంస్థ తొలగిస్తూ ఉత్తర్వులు ఇచ్చినప్పటికి ఉద్యోగులు మాత్రం తీసుకోకుండా ఎనిమిది గంటలు పని చేస్తామని విధులకు హాజరు కావడం విశేషం.. ఇలాంటి పరిస్థితుల్లో అధికారులు.. సంస్థ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందా? అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు..ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోకుండానే..: అత్యవసర సేవల కోసం వినియోగించే 108 వాహనాల విషయంలో ఉద్యోగులను తొలగించిన సంస్థ కనీసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదు. వాహనాల్లో కేవలం ప్రైవేట్‌ డ్రైవర్లను మాత్రమే నియమించారు. చాలా వాహనాల్లో అత్యవసర సమయంలో సేవలు అందించేందుకు నిపుణులు లేరు. ప్రాథమిక వైద్యం అందించేందుకు ఏఎన్‌ఎంలు, నర్సింగ్‌ సిబ్బంది వంటి వారు లేరు.దీంతో అత్యవసరంగా ఫోన్‌లు చేస్తే వాహనాలు అందుబాటులో లేవని చెబుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో సీరియస్‌ కేసులు ఉంటే హైదరాబాద్‌కు తరలించేందుకు గతంలో 108 వాహనాలు వచ్చేవి. అలాంటి అత్యవసర కేసులను సైతం తీసుకెళ్లడం లేదు. కేవలం నామమాత్రంగా గాయాలు, చిన్న చిన్న సమస్యలు ఉన్న కేసులను మాత్రం తీసుకెళ్తున్నారు.సమస్యలు పరిష్కరించాలని కొన్ని రోజులుగా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 108 ఉద్యోగులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీనిలో భాగంగా 12 గంటలు పని చేయాల్సి ఉన్నా.. ఎనిమిది గంటల పని విధానం అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఎనిమిది గంటలు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం 12 గంటలు పని చేయడం లేదని 108 వాహనాల్లో పని చేస్తున్న 127 మందిని విధుల నుంచి తొలగిస్తూ జీవీకే సంస్థ ఉత్తర్వులను వాట్సాప్‌ నంబర్లకు పంపించింది. అయితే నేరుగా సంతకాలు పెట్టి తీసుకునేందుకు ఉద్యోగులెవరూ ఆసక్తి చూపలేదు. ఉత్తర్వులు వచ్చినప్పటికి సోమవారం యథావిధిగా ఉద్యోగులు విధులకు హాజరయ్యారు. తాము ఎనిమిది గంటలు పని చేసేందుకు సిద్ధంగా ఉన్నామని, తమను తొలగిస్తున్నట్లు సంస్థ నుంచి ఉత్తర్వులు రాలేదని చెప్పారు. అయితే వీరికి వాహనాలు ఇవ్వకుండా ప్రైవేట్‌ డ్రైవర్లకు వాహనాలను ఇచ్చారు.గతంలో 108 ఉద్యోగులు సమ్మెలోకి వెళ్లిన సమయంలో అనేక సమస్యలు వచ్చాయి. ప్రస్తుతం ఉన్న వాటిలో చాలా వరకు కండిషన్‌ సరిగ్గా లేవు. దీంతోపాటు వాహనాల్లో సాంకేతిక సమస్యలు ఉన్నాయి. కొత్తగా వచ్చే డ్రైవర్లకు వీటిపై అవగాహన ఉండటం లేదు. గతంలో వాహనాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తి మధ్యలోనే నిలిపివేసిన సంఘటనలు ఉన్నాయి. దీని ద్వారా రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో పూర్తిస్థాయిలో డ్రైవింగ్‌పై పట్టు, వాహనాలపై అవగాహన ఉన్నవారిని మాత్రమే డ్రైవింగ్‌ కోసం తీసుకోవాలి. లేదంటే ఇలాంటి సమస్యలు మళ్లీ ఈసారి కూడా పునరావృతం అయ్యే ప్రమాదం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com