104లో మందుల కొరత!

పేదలు, బడుగులకు సమర్ధవంతమైన వైద్య సేవలు లభించేలా తెలంగాణ సర్కార్ చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో సర్కారీ దవాఖానాలను పటిష్టం చేయడంతో పాటూ సంచార వైద్యశాలలనూ అందుబాటులోకి తెచ్చింది. ఇక 104వాహనాలు గ్రామాల్లోని వారి చెంతకు వెళ్లి వైద్య సేవలు అందించేలా జాగ్రత్తలు తీసుకుంది. ఇదంతా బాగానే ఉన్నా 104సేవలు సమర్ధవంతంగా సాగడంలేదన్న విమర్శలు మెదక్ జిల్లాలో వినిపిస్తున్నాయి. ఈ వాహనాల ద్వారా మందులు సరిగా అందడం లేదని కొందరు అంటున్నారు. ముఖ్యంగా మధుమేహ బాధితులకు దాదాపు ఆరు నెలలుగా ఔషదాలు సక్రమంగా రావడం లేదని చెప్తున్నారు. బాధితులు ప్రతిరోజు ఉదయం, సాయంత్రం మాత్రలను కచ్చితంగా వేసుకోవాలి. మందులు లేకపోవడం వల్ల బయట కొనుక్కోవాల్సి వస్తోంది. దీంతో పేదలకు ఆర్ధిక భారమే అవుతోంది. కొంతమంది అయితే డబ్బులు లేక మందులు కొనుక్కోలేకపోతున్నారు. ఫలితంగా వారు ఆరోగ్యపరంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో ఆరు 104 వాహనాల ద్వారా గ్రామాల్లోని వారికి వైద్య సేవలు అందిస్తున్నారు. నెలలో నిర్దేశిత తేదీల్లో గ్రామాలకు వెళ్లి బాధితులను పరీక్షించి మందులు ఇస్తుంటారు. దీర్ఘకాలిక రోగులకైతే నెలకు సరిపడా మాత్రలను అందిస్తుంటారు.
ఇక షుగర్ బాధితుల విషయానికొస్తే.. జిల్లాలో వీరి సంఖ్య సుమారు మూడు వేలు ఉంటుంది. వీరిలో అత్యధికులకు 104వాహనాల ద్వారానే సేవలు అందిస్తున్నారు. నెలలో ఒక్క రోజు గ్రామానికి వచ్చే వాహనం వద్దకు రోగులు పెద్దఎత్తున వస్తుంటారు. ఇంతటి కీలమైన వైద్యసేవలు అందించే వారి వద్ద మందులు పూర్తిస్థాయిలో లేకపోవడంపై ప్రజలు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. ఇటు సిబ్బంది కూడా ఆరు నెలలుగా మాత్రలు రాకపోవడంతో రోగుల వెతలు చూడలేకపోతున్నారు. ఔషదాలు ఎందుకు అందించడంలేదన్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేక సతమతమవుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో అయితే బాధితులు మందులు ఎందుకు ఉండడం లేదంటూ సిబ్బందితో వాగ్వాదానికి కూడా దిగుతున్నారు. వాస్తవానికి సెంట్రల్‌ డ్రగ్‌ స్టోర్‌లోనే మందులు పూర్తిస్థాయిలో అందుబాటులో లేని దుస్థితి. ఈ కారణం వల్లే సిబ్బంది సైతం ఏం చేయలేకపోతున్నారు. మధుమేహ బాధితులకు మూడు రకాల మాత్రలు ఇస్తుంటారు. మూడు కలిపి నెలకు దాదాపు 66 వేల టాబ్లెట్స్ అవసరం ఉంటుంది. అరకొరగా 3 నుంచి 4 వేల మాత్రలే సరఫరా చేస్తుండడంతో సమస్యాత్మకంగా మారింది. బాధితులకు ఇస్తున్న డోస్‌లు రెండు మూడు రోజుల్లోనే అయిపోతున్నాయి. దీంతో ప్రభుత్వం, సంబంధిత అధికార యంత్రాంగం స్పందించి షుగర్ వ్యాధిగ్రస్తులకు 104 వాహనాల ద్వారా సమర్ధవంతమైన వైద్యం లభించేలా చర్యలు తీసుకోవాలని అంతా కోరుతున్నారు. పూర్తిస్థాయిలో మందులు అందుబాటులో ఉంచాలని విజ్ఞప్తి చేస్తున్నారు. బాధితుల సమస్యపై జిల్లా వైద్యాధికారి స్పందించారు. సమస్యను పరిష్కరించి మందులు సజావుగా సరఫరా జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com