వైరా జలాశయానికి భారీగా నీరు

వైరా జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం సామర్థ్యం 18.4 అడుగులు. ఇటీవల కురిసిన తుపానుకు వైరా రిజర్వాయర్‌ నీటిమట్టం 16.2 అడుగులకు పైగా చేరుకుంది. గత నాలుగేండ్లలో ఇదే అధికం. నీటిమట్టం భారీగా పెరగడంతో ఖరీఫ్‌ ప్రారంభంలో సుమారు 6,450 మంది ఆయకట్టు రైతులు నారుపోసుకున్నారు. ప్రస్తుతం నారుమడులకు నీరివ్వడానికి పైనుంచి ఆదేశాల్లేవని అధికారులు చెబుతున్నారు. ఈ నెల మొదటివారంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శైలేంద్రకుమార్‌జోషి ప్రత్యేకంగా సర్క్యులర్‌ కూడా జారీ చేశారు. తమ అనుమతి లేకుండా మిషన్‌ భగీరథకు కేటాయించిన రిజర్వాయర్లు, చెరువుల్లో నీరు విడుదల చేయొద్దని సర్క్యులర్‌లో స్పష్టంగా పేర్కొన్నారు. దీంతో ఇక్కడి అధికారులు నీరు విడుదల చేయడానికి వెనుకాడుతున్నారు. ధికారుల వద్ద మొరపెట్టుకున్నా నీరు విడుదల చేయకపోవడంతో వైరా రిజర్వాయర్‌ పరిధిలోని వైరా, కొణిజర్ల, బోనకల్‌, తల్లాడ మండలాల రైతులు ఆయిల్‌ ఇంజన్లు అద్దెకు తెచ్చుకుంటున్నారు. నారు అపోసుకుని ఇప్పటికే 15 రోజులు దాటిపోవడంతో నీరు లేక నెర్రెలు బారుతున్నాయి. ఈ నేపథ్యంలో నారును దక్కించుకునేందుకు గంటకు 200 రూపాయల చొప్పున ఆయిల్‌ ఇంజన్లు తెచ్చుకుంటూ ఆర్థిక భారం మోస్తున్నారు. నాట్లకు ముందు డ్రమ్ము కొట్టాలన్నా నీరే లేకపోయింది. అయితే గతంలో కుడి, ఎడమ కాల్వల ద్వారా నీటిని విడుదల చేసే అధికారులు.. 11 మండలాల ప్రజలకు తాగునీరందించేందుకు యత్నిస్తున్నారు. రిజర్వాయర్‌లో మొత్తం 2.52 టీఎంసీలకుగాను ప్రస్తుతం అంతేస్థాయిలో నిల్వ ఉన్నది. కానీ భగీరథ కోసం 1.28 టీఎంసీల నీరు నిల్వ ఉంచితేనే తాగునీరందించే వీలుంటుందని ఉన్నతాధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీచేయడంతో ఆయకట్టు పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *