వీడని చెక్కుల చిక్కులు

ప్రభుత్వం రెండో విడత పెట్టుబడి సాయానికి సమాయత్తమవుతుంటే జిల్లాలో మాత్రం విరుద్ధ పరిస్థితి. గత సెప్టెంబర్‌లో మొదలైన భూ దస్త్రాల ప్రక్షాళన ఇంకా కొనసాగుతుండగా పాసుపుస్తకాల్లో తప్పులు, అందని పాసుపుస్తకాలు వేలల్లో ఉండగా అందని చెక్కులు అంతకుమించి ఉండటం అధికారుల పనితీరుకు అద్దం పడుతోంది. ఖరీఫ్‌ మొదలై రెండు నెలలు గడుస్తుండగా ఇంకా మొదటి విడత చెక్కులు అందుకోని రైతులు 20వేలకు పైగా ఉండటం ఆందోళనకర పరిణామం. జిల్లా ప్రత్యేక అధికారిగా స్మితాసబర్వాల్‌ను నియమించగా యుద్దప్రతిపాదికన రైతులకు మేలు జరుగుతుందని ఆశించగా ఆడియాసలే. ఇక మరో వారం రోజుల్లో వచ్చిన చెక్కుల కాలపరిమితి ముగియనుండటంతో ఆ లోపైనా దస్త్రాల దిద్దుబాటు పూర్తవుతుందా..నన్నది అనుమానమే. చెక్కులు వాపసా.. మనుగడలో ఉంటాయో అధికారులపైనే భారం.
ప్రతి ఎకరాకు రూ.4వేలు ఇవ్వాలన్నది ప్రభుత్వ ఉద్దేశ్యం. రెండు సీజన్లకు గానూ సీజన్‌కు రూ.4వేలు ఇస్తుండగా మొదటి విడత చెక్కులు తీసుకోని రైతులు 20వేలకు పైగా ఉండటం విశేషం. జిల్లాకు 124824 పట్టాదారులకు సంబంధించి 145989 చెక్కులు రాగా రూ.124.58కోట్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో 125384 చెక్కులను పంపిణీ చేయగా రైతులకు అందిన మొత్తం రూ.111.19కోట్లు. ఇతర దేశాల్లో ఉండటం, ఇతర రాష్ట్రాల్లో ఉన్న రైతులు, మరణించిన రైతులు ఉండటంతో 20605 చెక్కులు కార్యాలయాల్లో మూలుగుతున్నాయి. మొత్తంగా రూ.13.39కోట్ల విలువైన చెక్కుల పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారైంది. మరో వారం రోజులు గడిస్తే చెక్కుల కాలపరిమితి ముగియనుంది. ఇకవేళ అదే జరిగితే రైతులకు పడిగాపులే. అత్యధికంగా మానకొండూరు మండలంలో 2934 చెక్కులు పెండింగ్‌లో ఉండగా అత్యల్పంగా కొత్తపల్లి మండలంలో 289 చెక్కులు అందాల్సి ఉంది. రామడుగు 2720, తిమ్మాపూర్‌ 2369, గంగాధర 2244, చిగురుమామిడి 2076, చొప్పదండి 1188, కరీంనగర్‌ రూరల్‌ 1148, వీణవంక 1095, శంకరపట్నం 908, సైదాపూర్‌ 827, జమ్మికుంట 775, హుజూరాబాద్‌ 765, గన్నేరువరం 684, ఇల్లందకుంట 653 చెక్కులు పెండింగ్‌లో ఉన్నాయి.
ధరణి వెబ్‌సైట్‌లో నెలకొన్న సాంకేతిక సమస్యలతో పాసుపుస్తకాల ముద్రణ ఒకడుగు ముందుకు రెండడుగులు వెనక్కన్న చందంగా మారింది. జిల్లాలో పట్టాదారులు 136051 ఉండగా 116459మంది రైతులకు పంపిణీ చేశారు. 19592 మంది కర్శకులు చెక్కులు, పాసుపుస్తకాల కొరకు పడిగాపులు కాస్తున్నారు. తహసీల్దార్‌ కార్యాలయాల చుట్టు తిరగడం.. నిరాశగా వెనుదిరగడం నిత్యకృత్యమైంది. జారీ అయిన వాటిలో సర్వేనంబర్లు తప్పిపోవడం, కులం, రైతుల పేర్లు తప్పుగా దొర్లడం, మరణించిన వారి పేర్లు రావడం, ఆధార్‌ అనుసంధానం కాకపోవడం, ఫోటో రాకపోవడం, తండ్రి పేరు తప్పు, ఉన్న విస్తీర్ణానికి ఎక్కువ విస్తీర్ణం నమోదవడం వంటి సమస్యలున్నాయి. ఇవేకాకుండా అసలు పాసుపుస్తకాలు రాని రైతులు సుమారు 10వేల వరకు ఉండొచ్చని అంచనా. వెయ్యి వరకు కోర్టుకేసులతో పెండింగ్‌లో ఉండగా 9వేల వరకు రైతులకు పాసుపుస్తకాలు రాలేదని గణాంకాలు చాటుతున్నాయి. వీరందరికి చెక్కులు రావాలంటే పక్కాగా పాసుపుస్తకాల ముద్రణ కావాలన్న మాట.
అయితే యాసంగి సీజన్‌ అక్టోబర్‌లో ప్రారంభం కానుండగా అందుకు ముందుగానే చెక్కులను పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే తదనుగుణంగా కసరత్తు ఉండాలని జిల్లా యంత్రాంగాన్ని మౌఖికంగా ఆదేశించింది. సెప్టెంబర్‌ మొదటి వారం నుంచి చెక్కులను ఇచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో అప్పటివరకైనా భూ దస్త్రాల ప్రక్షాళన సమాప్తమవుతుందా..నన్నది అధికారులపైనే ఆధారపడి ఉంది. లేకుంటే పడిగాపులు షరామామూలే.
మిగిలిన చెక్కుల్లో 40శాతం చెక్కులు ఎన్నారై, ఇతర రాష్ట్రాల్లో ఉంటున్నవారేనని తెలుస్తోంది. అధికారిక లెక్కల ప్రకారం 3వేల వరకు ఇతర దేశాల్లో ఉన్నారని గుర్తించగా మరింత ఎక్కువగా ఉంటారని సమాచారం. అమెరికా, జర్మనీ, స్విట్జర్లాండ్‌, సింగపూర్‌, దుబాయి, సౌదీ, మలేషియా, ఒమన్‌ తదితర దేశాల్లో ఉపాధి పొందుతున్నారు. వారికి సంబంధించిన చెక్కులను వారి కుటుంబీకులకు ఇస్తారని అప్పట్లో ప్రచారం జరుగగా ఇంకా ఎటూ తేల్చకపోవడం గల్ఫ్‌ బాధితుల్లో ఆందోళన నెలకొంది. ఒకవేళ చెక్కుల కొరకు స్వదేశం రావాలనుకుంటే రానుపోనూ ఖర్చులు అంతకు రెట్టింపవుతుండటంతో కుటుంబీకులకే ఇవ్వాలని ఎమ్మెల్యేలను కోరుతున్నారు. అయితే ధరణిలో నెలకొన్న సాంకేతిక సమస్యల వల్లే సవరణ ఆలస్యమవుతోందని, అయినా వీలైనంత త్వరగా పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని రెవెన్యూ అధికారులు వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *