రేపటి నుంచి విజయవాడలో ఎయిర్‌షో

0

నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో పండుగ కళ ఉట్టి పడుతోంది. రాష్ట్ర విభజన తరువాత తొలిసారిగా అమరావతిలో ఎయిర్‌షో జరగనుంది. కృష్ణానది తీరానికి సంక్రాంతి కంటే ముందే పండగొచ్చింది. సంక్రాంతి పర్వదినం రెండు రోజులు ముందే విజయవాడ నగర వాసులను విమానాల విన్యాసాలు కనువిందు చేయనున్నాయి. చూసేందుకు రెండు కళ్లు చాలవన్నట్లుగా ఎయిర్‌క్రాఫ్ట్‌లతో గగన తల విన్యాసాలు జరగనున్నాయి. నవ్యాంధ్ర రాజధాని అందుకు వేదికైంది. అమరావతి పేరు మారుమోగేలా విన్యాసాలు ఉంటాయి. భవానీపురంలోని పున్నమి, భవానీ స్నాన ఘాట్‌ల వెంట ఏర్పాట్లు పూర్తయ్యాయి. పౌర విమానయాన శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 12వ తేదీ నుంచి మూడు రోజుల పాటు ఎయిర్‌షో నిర్వహించనున్నారు. అందుకు నదీ తీర ప్రాంతాన్ని అందంగా తీర్చిదిద్దారు. కృష్ణా పుష్కరాల సమయంలో కృష్ణా నది తీరానికి కొంత మేర కొత్తరూపు సంతరించుకుంది. ఒడ్డున రెండు కిలోమీటర్ల మేర స్నాన ఘాట్‌లను అందంగా తీర్చిదిద్దారు. ప్రస్తుతం ఎయిర్‌షోను పురస్కరించుకుని నదీ తీర ప్రాంతాన్ని మరింత అందంగా తయారు చేస్తున్నారు. వందలాది లారీలతో మట్టిని తీసుకుని వచ్చి చదును చేశారు. పున్నమి స్నాన ఘాట్‌ వద్ద నుంచి భవానీ ఘాట్‌ వరకు ఉన్న 14 ఎకరాల్లో పనులు సాగుతున్నాయి. బ్రిటన్‌కు చెందిన నాలుగు ఎయిర్‌ క్రాఫ్ట్ లు విన్యాసాలు చేయనున్నాయి. దాదాపు 20 నిమిషాల పాటు ఆకాశంలో కనువిందు చేయనున్నాయి.

Share.

Comments are closed.