మధ్య ప్రదేశ్ లో కాంగ్రెస్, బీఎస్పీ మధ్య పొత్తు సాధ్యమేనా

భోపాల్, ఆగస్టు 1(న్యూస్ పల్స్)
విపక్షాలన్నీ ఒక్కటై మోడీ టీంను మట్టి కరిపించాలన్న ప్రయత్నాలు ఒకవైపు జరుగుతుంటే అది సాధ్యమయ్యేలా కన్పిచడం లేదు. లోక్ సభ ఎన్నికల మాట దేవుడెరుగు త్వరలో జరగబోయే మధ్య ప్రదేశ్ ఎన్నికల్లోనే పొత్తు అసాధ్యమని స్పష్టమవుతోంది. విపక్షాలన్నీ కలసి లోక్ సభ ఎన్నికల్లో మోడీని ఢీకొట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమత బెనర్జీ తన వంతు ప్రయత్నం చేస్తున్నారు. సోనియాను కలిసి వచ్చే ఎన్నికలపై చర్చించారు. తాజాగా ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ను కలసి విపక్షాలు సంఘటితంగా ఉండాల్సిన అవసరంపై ఆమె సుదర్ఘ చర్చలు జరిపారు.అయితే బీఎస్పీ అధినేత్రి మాయావతి మాత్రం తన రూటు సపరేటు అంటున్నారు. లోక్ సభ ఎన్నికల సంగతి తర్వాత చూద్దాం…ముందు మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్ ఘడ్ ఎన్నికల్లో పొత్తుల విషయం తేల్చండని పట్టు బడుతున్నారు. మధ్యప్రదేశ్ లో మొత్తం 230 స్థానాలున్నాయి. అయితే ఇందులో బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి మాత్రం తమకు యాభై సీట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. కాని కాంగ్రెస్ మాత్రం అందుకు అంగీకరించడం లేదు. తాము 22 స్థానాలకు మించి ఇవ్వలేమని కాంగ్రెస్ పార్టీ చెప్పేయడంతో పొత్తులుచర్చలు నిలిచిపోయాయి. చివరకు 30సీట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ అంగీకరించినా బీఎస్పీ ససేమిరా అంటుంది. ఇక్క బీఎస్పీ, కాంగ్రెస్ కలసి వెళతాయా? అన్న అనుమానం బయలుదేరింది.తొలినుంచి మధ్యప్రదేశ్,రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీ నేతలు పొత్తులను వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా మధ్యప్రదేశ్ లో దిగ్విజయ్ సింగ్, జ్యోతిరాదిత్య సింథియా వంటి నేతలు ఒంటరిగా వెళ్లినా ఖచ్చితంగా ఈసారి మధ్యప్రదేశ్ ను కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. దాదాపు పదిహేనేళ్లుగా బీజేపీ మధ్యప్రదేశ్ లో అధికారంలో ఉంది. గత ఎన్నికల్లోనూ 165 స్థానాలను సాధించిన కమలం పార్టీ, 2014 లోక్ సభ ఎన్నికల్లోనూ మొత్తం 29 పార్లమెంటు స్థానాల్లో 27 చోట్ల గెలిచి విజయకేతనం ఎగురవేసింది.పన్నెండేళ్లుగా ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న శివరాజ్ సింగ్ చౌహాన్ మీద పార్టీలోనూ, ప్రజల్లోనూ వ్యతిరేకత ఉందని కాంగ్రెస్ చెబుతోంది. ముఖ్యంగా పీసీసీ చీఫ్ గా ఉన్న జ్యోతిరాదిత్య సింథియా పొత్తులను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దాదాపు పదిహేనేళ్ల నుంచి 230 నియోజకవర్గాల్లో నేతలు, కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేశారని, ఈ దశలో పొత్తులంటూ సీట్లను ఇతరులకు ఇస్తే పార్టీలో అసంతృప్తులు బయలుదేరుతాయని జ్యోతిరాదిత్య అభిప్రాయపడుతున్నారు. అయితే కాంగ్రెస్ అధిష్టానం మాత్రం వచ్చే లోక్ సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని సర్దుకు పోవాలని చెబుతోంది. 30సీట్లకు మించి ఇవ్వలేమని చివరకు మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నేతలు చెప్పడంతో బీఎస్పీ తన నిర్ణయాన్ని వెల్లడించలేదు. దీంతోఇక్కడ పొత్తు ఉంటుందా? లేదా? అన్నది సందేహమే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com