పరుగులు పెడుతున్న కియా మోటర్స్

అనంతపురం, ఆగస్టు1 (న్యూస్ పల్స్)
పెనుకొండ వద్ద నిర్మితమవుతున్న కియా కంపెనీ కార్ల తయారీకి వేగంగా అడుగులు వేస్తోంది. పరిశ్రమలో కీలకమైన సాంకేతిక మానవ వనరులు సమీకరణకు చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా జిల్లాలోని అర్హులైన అభ్యర్థులకు శిక్షణ ఇస్తోంది. శిక్షణ పొందిన వారిలో కియా ఆశిస్తున్న ఐదు అంశాలు ఉన్న వారిని ఎంపిక చేయనుంది. జిల్లాలో యువతకు రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, కియా మోటార్స్‌ ఇండియా సంయుక్తంగా ఆటో మొబైల్‌ పరిశ్రమలపై సాంకేతిక శిక్షణ కోర్సు ప్రారంభించాయి. ఈ నెల 20వ తేదీన ఏపీఎస్‌ఎస్‌డీసీ ఎండీ సీఈవో సాంబశివరావు, జిల్లా కలెక్టర్‌ వీరపాండియన్‌, కె.ఎం.ఐ. ఎండీ హ్యూన్‌కుక్‌షిమ్‌ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులను ప్రారంభించారు. శిక్షణ పొందటం కోసం పాలిటెక్నిక్‌ అభ్యర్థులు అర్హులు.అర్హులైన వారు ఏపీఎస్‌ఎస్‌డీసీ వెబ్‌సైట్‌లో ఉద్యోగం కోసం నమోదు (రిజష్టరు) చేసుకోవాలి. ఇలా ఇప్పటి వరకు 6 వేల మంది అభ్యర్థులు ఆన్‌లైన్‌లో తమ పేర్లు నమోదు చేసుకొన్నారు. దరఖాస్తు చేసుకున్న డిప్లమో విద్యార్థుల్లో ఎంపిక చేసిన 2,145మందికి గాను 1,100మందికి ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించారు. అందులో ఉత్తీర్ణులైనవారికి ఆటోమొబైల్‌ పరిశ్రమల కోసం ప్రాథమిక సాంకేతిక కోర్సుపై శిక్షణ ఇస్తున్నారు. కియలో నేరుగా 4వేల మందికి, పరోక్షంగా 7వేల మందికి ఉద్యోగాలు రానున్నాయి. ఈ నేపథ్యంలో ఎంపిక చేసిన అభ్యర్థులకు పలు విభాగాల్లో శిక్షణ జోరుగా సాగుతోంది. నేరుగా ఉద్యోగ అర్హత సాధించినవారితో పాటు సాంకేతిక శిక్షణలో నైపుణ్యం కనబరచిన అభ్యర్థులకు శిక్షణ తరగతులు ప్రారంభించారు.33మంది చొప్పున బ్యాచ్‌లుగా విభజించి కారు విడిభాగాలు అమర్చడం, తొలగించడం, బాడీషాప్‌, పెయింట్‌షాప్‌ విభాగాల్లో 11మంది ప్రత్యేక ట్రైనర్ల పర్యవేక్షణలో శిక్షణ ఇస్తున్నారు. శిక్షణ కాలంలో వసతి, భోజన సదుపాయం ఏపీఎస్‌ఎస్‌డీసీ కల్పిస్తోంది. రోజుకు 8 గంటల పాటు శిక్షణ కొనసాగుతుంది. మొత్తం 4వారాలకు శిక్షణ ఉంటుంది. ఇందులో సైద్ధాంతిక శిక్షణ, 20 విభాగాల్లో ప్రయోగ శిక్షణ (ప్రాక్టికల్స్‌) ఇస్తారు. ఒక్కో విభాగాంలో శిక్షకుడు అవగాహన కల్పిస్తారు. తరువాత అభ్యర్థి ప్రాక్టికల్స్‌ పూర్తి చేయాలి. ఈ శిక్షణలో అభ్యర్థి, సహనం, పనిపట్ల నిబద్ధత, పనిలో కచ్చితత్వం, సమయపాలన, నైపుణ్యత కొలమానంగా అభ్యర్థులను తరువాత పరీక్షకు ఎంపిక చేస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com