నీళ్లొదిలేశారు

జిల్లాలో బీసీ, ఎస్సీ, ఎస్టీ వసతిగృహాల్లో నాలుగు సంత్సరాల క్రితం విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఆర్‌వోప్లాంట్‌లు ఏర్పాటు చేశారు. ఒక్క యంత్రం రూ. 2 నుంచి రూ. 3 లక్షలు ఖర్చు చేసి కొనుగోలు చేశారు. జిల్లాలో ప్రస్తుతం సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాలకు చెందిన 32 పాఠశాల వసతిగృహాలలో ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేయగా ప్రస్తుతం కేవలం 7 మాత్రమే పనిచేస్తున్నాయి. 25 ప్లాంట్లు మూలకు చేరాయి. ఇక కళాశాల వసతి గృహాలు 10 ఉండగా వీటిలో ఐదు యంత్రాలు మాత్రమే పనిచేస్తున్నాయి. ఇక బీసీ సంక్షేమ  శాఖ హాస్టళ్లలో  25 ప్లాంట్లు ఏర్పాటు  చేయగా 10 పనిచేయడం లేదు. గిరిజన సంక్షేమ  శాఖ పరిధిలో మొత్తం 8  యంత్రాలు  ఉండగా ఒకటీ పనిచేయడం లేదు.
జిల్లాలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ వసతిగృహాలకు రూ. 2 కోట్లు వెచ్చించి ఆర్వో ప్లాంట్లు కొనుగోలు చేశారు. కానీ వీటికి ప్రతి నెల లేదా ప్రతి ఆరు నెలలకు చిన్నపాటి మరమ్మతులు చేసేందుకు ప్రభుత్వం నుంచి ఎలాంటి నిధులు కేటాయించలేదు. ఒక యంత్రం పాడయిపోయిందంటే బాగుచేసేందుకు ప్రత్యేక నిధులు లేకపోవడంతో వీటి నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. ప్రస్తుతం పాడయిన నీటి శుద్ధి పరికరాలకు రూ. 5000 ఖర్చు చేస్తే వినియోగంలోకి వచ్చేవి ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి. కానీ నిబంధనల ప్రకారం వీటి నిర్వాహణకు నిధులు లేక విలువైన యంత్రాలు మూలన పడ్డాయి.
అధికారులు, వసతి గృహం వార్డెన్లు, అధికారులు విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. నీటి శుద్ధి యంత్రాల నిర్వహణకు డబ్బులు లేవంటూ వదిలేయడంతో వేల సంఖ్యలో ఉన్న విద్యార్థులు బోరు నీళ్లు తాగాల్సిన పరిస్థితి ఏర్పడింది. వసతిగృహాలు ప్రారంభమై మూడు నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు వీటిని బాగుచేయించిన దాఖలాలు లేవు. అసలే వర్షాకాలం తాగునీరు కలుషితం కావడం వల్ల 80 శాతం వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని ఇప్పటికే వైద్యులు హెచ్చరిస్తున్నారు. అయినా అధికారుల్లో చలనం లేదు. విద్యార్థుల ప్రాణాల మీదకు వచ్చి ఆసుపత్రిలో చేరిన తరువాత హడావిడి చేసి లెక్కలు తీసి వెంటనే మరమ్మతు చేయించాలని ఆదేశాలు చేయడం పరిపాటిగా మారింది.
హాస్టళ్లలో ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్లను సరిగా పట్టించుకోక పోవడంతో తరచూ మొరాయిస్తున్నాయి. ఇక్కడ పనిచేసే సిబ్బందే వీటి నిర్వహణ చూస్తున్నారు. వార్డెన్‌లు వీటివైపు కన్నెత్తి చూడక పోవడం వల్ల తరచూ సాంకేతికలోపాలు తలెత్తి మొరాయిస్తున్నాయి. నిబంధనల ప్రకారం ఈ ప్లాట్లు నడిపించేందుకు సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి కానీ ఇవేవీ లేకుండానే వీటిని నడిపించడంతో సైతం యంత్రాలు చెడిపోతున్నట్లు సమాచారం. ప్రధానంగా ఉపయోగించే తీరు సరిగా లేకపోవడం వల్ల యంత్రాలు పాడవుతున్నట్లు తెలిసింది. జిల్లాలోని హాస్టళ్లలో మొత్తం 17 సోలార్‌ విద్యుత్‌ పరికరాలు ఏర్పాటు చేశారు. వీటిలో ప్రస్తుతం నిర్వహణ సరిగా లేకపోవడంతో 6 పరికరాలు మూలన పడ్డాయి. బ్యాటరీల కాలం ముగియడంతో కొత్తవి కొనుగోలు చేయడంలో నిధులు లేక, కొన్ని ప్రాంతాల్లో సోలార్‌ ప్లేట్లు పగిలిపోవడంతో పరికరాలు సరిగా పనిచేయక నిరుపయోగంగా మారాయి. వీటి నిర్వహణకు నయాపైసా నిధులు లేకపోవడంతో పాడయిపోయిన వాటిని మూలన పారవేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *