నాణ్యత కనిపించదే.. నెల్లూరు

పట్టణానికి నూతన హంగులు తీసుకువచ్చేందుకు రైల్వేస్టేషన్‌ నుంచి కైవల్యనది వరకు నాలుగులైన్ల రోడ్డు విస్తరణ పనులు చేపట్టారు. అభివృద్ధి నిధుల ద్వారా రూ.11 కోట్లతో చేపట్టిన ఈ పనులు తొలి నుంచి నాసిరకంగా చేస్తున్నారు. రైల్వేస్టేషన్‌ నుంచి కైవల్యనది వరకు నిర్మిస్తున్న డివైడర్‌ పనులు మరీ ఆధ్వానంగా ఉన్నాయి. డివైడర్‌ నిర్మాణానికి అధిక మోతాదులో ఇసుకను వినియోగిస్తున్నారు. అడుగున బెడ్‌ నిర్మాణం చేపట్టారు. ఇదీ అత్యంత దారుణంగా ఉంది. పూర్తిగా ఇసుకతోనే ఈ నిర్మాణాలు చేపట్టారు.
రైల్వేస్టేషన్‌ నుంచి కైవల్య నది వరకు దాదాపు మూడు కిలోమీటర్లు మేర డివైడర్‌ నిర్మాణ పనులు ప్రస్తుతం చేపట్టారు. అధిక మొత్తంలో ఇసుకతోనే పూర్తి చేశారు. పనులు చేసే సమయంలో సంబంధిత శాఖ అధికారులు పర్యవేక్షణ లేకపోవడంతో గుత్తేదారు తన ఇష్టానుసారంగా చేశారు. ఇసుక,సిమెంట్‌,కంకర మిక్సింగ్‌ చేసే మిషన్‌ నిర్వాహకులు   ఇసుకను బకెట్‌తో నింపేశారు. రెండు బస్తాల సిమెంట్‌ వేస్తే బకెట్‌కు మించి ఇసుకను నింపి మిక్సింగ్‌ చేసి పనులు చేపట్టారు. మరోవైపు స్థానికంగా వాగులు,వంకల వద్ద  జల్లించి తీసుకువచ్చిన ఇసుకను వినియోగించారు.
చిన్నపాటి ద్విచక్రవాహనం ఢీ కొడితేనే డివైడర్‌ పెచ్చులూడుతోంది. క్రాస్‌రోడ్డు నుంచి పట్టణంలోకి నిర్మించిన డివైడర్‌ మరి ఆధ్వానంగా ఉంది. ఇటీవల ఓ వాహన చోదకుడు ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే క్రమంలో డివైడర్‌ను ఢీకొన్నారు. పెచ్చులూడి పోయింది. చిన్నపాటి వాహనం తగిలితేనే దెబ్బతినే డివైడర్‌ను పెద్ద వాహనాలు ఢీకొట్టే పరిస్థితి ఏమిటి అనే అనుమానం ప్రజలకు వచ్చింది. పట్టణ పరిధిలో దాదాపు మూడు కిలోమీటర్ల మేర నిర్మించిన డివైడర్‌ పనులకుగాను దాదాపు రెండున్నర కిలోమీటర్ల వరకు  పూర్తి చేశారు. నేటి వరకు చుక్క నీరు పట్టిన దాఖలాలు లేవు. పనులు చేపట్టిన నాటి నుంచి క్యూరింగ్‌ చేయకుండానే వదిలేశారు. ఇప్పుడు సిమెంట్‌ పూత పని చేపట్టారు. ఇవి కూడా నాసిరకంగా చేస్తున్నారు. ఆధునికీకరణ పేరుతో నాసిరకంగా నిర్మాణాలు చేస్తున్నా  ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయింది. ఈ పనులు వెంకటగిరి ర.భ డీఈ అధికారి లేకపోవడంతో ఇన్‌ఛార్జి పాలనలో నడుస్తున్నాయి.
పట్టణ పరిధిలో నిర్మిస్తున్న రోడ్డు పనులు ఆక్రమణలు తొలగించకుండానే చేస్తున్నారు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో రకంగా  చేస్తున్నారు. తొలుత రెవెన్యూ,మున్సిపాలిటీ,విద్యుత్తు,ర.భ శాఖ అధికారులు పర్యవేక్షించి పనులు చేపట్టాలి. గతంలో ముందుకు వచ్చిన కట్టడాలను తొలగించారు.తరువాత యథావిధిగా వ్యాపారులు ముందుకు వచ్చారు. ప్రస్తుతం జరుగుతున్న పనుల్లో వీటి గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. గుత్తేదారు తమకు ఉన్నంత స్థలంలోనే నిర్మాణాలు చేస్తున్నారు. ఆర్టీసీ బస్టాండ్‌ నుంచి త్రిభువని కూడలి వరకు రోడ్డు మరీ కుంచించుకునే పోయేలా ఉంది. ఇక్కడ సైడు కాలువ ఉందనే నెపంతో వెడల్పు తగ్గిస్తున్నారు. వాస్తవానికి దుకాణాలకు, కాలువకు మధ్య చాలా ప్రభుత్వ స్థలం ఉంది. గతంలో కాలువ నిర్మించిన క్రమంలో రాజకీయ ఒత్తిళ్లు, ఇతర ప్రలోభాల ప్రభావంతో కాలువను దూరం జరిపి నిర్మించారు. ఇప్పుడు అదే సమస్యగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *