ధర్మపురి అభివృద్ధికి 50 కోట్లు

తెలంగాణ దేవస్థానాల పునరుద్ధరణ, పునర్మిర్మాణ, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న ఈ ఏడు రాష్ట్ర బడ్జెట్‌లో ధర్మపురి క్షేత్రానికి 50కోట్ల నిధులను కేటాయించింది. తదనుగుణంగా దేవస్థానంలో చేపట్టాల్సిన పనులపై అధికారులు సంసిద్ధమవుతూ, రూపకల్పనలు చేయడానికి ఉపక్రమిస్తున్న వేళ…సంప్రదాయ ఆచరణకు భంగం వాటిల్లకుండా పనులు చేపట్టాలనే విషయంలో ప్రస్తుతం క్షేత్రంలో విస్తృత చర్చలు జరుగుతున్నాయి. భారతీయ ప్రాచీన సభ్యతా సంస్కృతులకు, సనాతన సాంప్రదాయాలకు అనాదిగా నిలయమై, విశేష పౌరాణిక, ఐతిహాసిక, చారిత్రిక ప్రాధాన్యతను సంతరించుకుని, పలు దేవాలయాల సముదాయంతో విరాజిల్లు తున్నది గంభీర గౌతమీ తటమున వెలసిన పవిత్ర తీర్థం ధర్మపురి పుణ్యక్షేత్రం. దక్షిణ కాశీగా, నవనారసింహ క్షేత్రాలలో నొకటిగా, హరిహర క్షేత్రంగా, తెలుగు నేలపై వాసికెక్కి శాతవాహన, రాష్టక్రూట, చాళుక్య. కాకతీయ, రేచర్ల వెలమాది హైందవ, నిజాం ప్రభువుల ప్రాభవంలో మహోన్నత వైభవాన్ని అనుభవించినదీ క్షేత్రరాజం. ఇక్కడి ప్రాచీన ఆలయాలలో…సనాతన సాంప్రదాయాలు నేటి వరకు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రతి నిర్మాణంలోనూ ప్రత్యేకత దృగ్గోచరమవుతుంది. ఇది హరిహర అభేద్య క్షేత్రం. బ్రహ్మ విష్ణు మహేశ్వర త్రైమూర్త్య నిలయం. ప్రధాన దైవం నృసింహుడే అయినా, స్మార్త ఆగమ పద్ధతిని అనుసరిస్తూ వస్తున్న క్రమం. స్మార్తులచే నిత్య పంచోపనిషత్ యుక్త వేదఘోషలు, అర్చకులు పూజలు నిర్వహిస్తుండడం అనాదిగా ఆచరణలో ఉంది. ప్రధానాలయ నృసింహాలయ ప్రాంగణాన చుట్టూ ఆంజనేయ విగ్రహాలుండడం విశేషం.రాష్ట్ర పురావస్తు శాఖచే రిజిస్టర్ అయిన దేవస్థానంలో గతంలోనూ పునర్మిర్మాణాలు చేసిన సందర్భాలలో అభ్యంతరాలు చోటు చేసుకున్నాయి. గణపతి ఆలయ నిర్మాణం, రామలింగేశ్వరాలయ ప్రహారీ విషయాలలో పురావస్తు శాఖ అభ్యంతరాలను తెలిపి, తప్పులను సవరించే చర్యలను గైకొంది. నారసింహ ప్రధానాలయ, శివాలయాల కుడ్యాలకున్న అపురూప ప చెక్కడాల, శాసనాల కనుమరుగుపై పురావస్తు శాఖ కనె్నర్ర చేసింది. ఇకముందు అలా జరగనీయమని, పూర్వానుమతులు లేనిదే పనులు చేపట్టమని లిఖితపూర్వకంగా రాయించుకుంది. ప్రస్తుత ప్రతిపాదిత నృసింహాలయ విస్తరణకు సంబంధించి, గర్భాలయ, అర్థ మంటప, పంటపాలను వాటి కొలతలకు అనుగుణంగా పతక రచనలు చేయడానికి ఆగమాధారాన్ని అనుసరించాల్సి ఉంది. ఆలయాన్ని ఆనుకుని ముందు భాగాన కాకతీయ నిర్మిత కళ్యాణ మంటపం ఉంది. శివాలయ ముఖ ద్వారం చారిత్రక నేపథ్యాన్ని కలిగి, గతంలోనే పురావస్తు శాఖ పునర్నిర్మాణానికి అడ్డుపడింది. బ్రహ్మపుష్కరిణికి ఉత్తర ద్వారం గుండానే స్థానిక దైవాలు తెప్పోత్సవ, డోలోత్సవాలకు వేంచేసి, తిరిగి అదే ద్వారం గుండా ఇసుకస్థంభం వద్దకు వెళ్ళడం స్థల పురాణాధారం.ఆచరణలో ఉన్న క్రమం. గతకొంత కాలంగా చేపడుతున్న వివిధ మార్పులు, చేర్పుల విషయంలో దేవస్థాన నిర్వాహకుల ఏకపక్ష నిర్ణయాలతో, బాధ్యతలేని అధికారుల అలసత్వంతో, క్రమక్రమంగా దేవస్థాన సంప్రదాయాలకు విలువ లేకుండా అవుతున్నది. సనాతనత్వం కనుమరుగు అవుతున్నది. ఈ నేపథ్యంలో 30కోట్ల ప్రతిపాదిత పనులను నిర్ణయించే ముందు అనుభవైకవేద్యులైన స్మార్త ఆగమ పండితులతో చర్చించి, సనాతన సాంప్రదాయాచరణకు భంగం వాటిల్లకుండా చూడాలని స్థానికులు అభిప్రాయ పడుతున్నారు. అభివృద్ధి ఆహ్వానామోదమే అయినా, కోట్లాది నిధులతో ఆలయాల పునరుద్దరణ పేరిట కృత్రిమ మెరుగులెన్ని దిద్దినా, వెల కట్టజాలని వేల సంవత్సరాల ప్రాచీనత్వం, సనాతనత్వం తిరిగి పొందజాలమనేది నిర్వివాదమైన నగ్నసత్యం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com