దోచుకున్నోళ్లకి దోచుకున్నంత… (విశాఖ)

విశాఖ, ఆగస్ట్ 1 ( న్యూస్ పల్స్):
పంచదార్ల అడ్డాగా కంకర దందా ఏడాది కాలంగా సాగుతోంది. సాక్షాత్తూ గ్రామ రెవెన్యూ సహాయకుడికి (వీఆర్‌ఏ) ప్రభుత్వం మంజూరు చేసిన అసైన్డ్‌ భూమిలో కంకర తవ్వకాలకు అనుమతులు తెచ్చుకొని పగలూ రాత్రీ తేడా లేకుండా భారీగా తరలిస్తున్నారు. ఆ భూమి ఎందుకు పనికిరాకుండా సుమారు పది నుంచి 15 అడుగుల లోతున తవ్వేశారు. ఈ వీఆర్‌ఏ అనారోగ్యంతో కొనాళ్ల క్రితం మంచం పట్టారని కొందరు గ్రామస్థులు చెప్పారు. కంకర వ్యాపారంలో లాభాల రుచి చూసిన వ్యాపారులు రాజకీయ నాయకుల అండదండలతో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న అసైన్డ్‌ భూముల లబ్ధిదారులను చేరదీస్తున్నారు. వారికి కొంత మొత్తం ముట్టజెప్పి వారితోనే కంకర తవ్వకాలకు దరఖాస్తు చేయిస్తున్నారు.
భూగర్భ గనుల శాఖ అధికారుల నుంచి స్థానిక తహసీల్దారు కార్యాలయానికి నిరభ్యంతర ధ్రువపత్రం (ఎన్‌ఓసీ) కోసం ఆ దరఖాస్తులు చేరకముందే పైరవీలు సాగిస్తున్నారు. ఎన్‌ఓసీ జారీ చేసిన తహసీల్దారు, రెవెన్యూ సిబ్బంది ఆ తరువాత ఎంత మోతాదులో కంకరను తరలిస్తున్నారో పర్యవేక్షణకు వెళ్లడం లేదు. దీంతో వెయ్యి క్యూబిక్‌ మీటర్లకు అనుమతులు ఇస్తే అందుకు పది రెట్లు తరలించుకుపోతున్నారు. దీంతో సీనరేజ్‌ రూపంలో మైనింగ్‌ శాఖకు చేరాల్సిన మొత్తం స్వార్థపరుల జేబుల్లోకే పోతోంది. మూడేళ్ల క్రితం విజిలెû్్స ఎన్‌ఫోర్స్‌మెంటు విభాగం అధికారులు మండలంలో కొండప్రాంతాల్లో తవ్వేసిన కంకర క్వారీలను పరిశీలించి కేసులు నమోదుచేసి అపరాధ రుసుములు విధించినా కంకర దందా ఆగడం లేదు. తాజాగా ఈ దందా మరింత జోరుగా సాగుతోంది.
భూగర్భ గనుల శాఖ అధికారులు తవ్వకాలకు అనుమతులు మంజూరు చేసిన క్వారీలను క్షేత్ర పరిశీలన చేయకుండా విశాఖలో కూర్చొని బిల్లులు జారీ చేస్తున్నారు. టిప్పర్‌ (డంపర్‌) లారీకి 14 క్యూబిక్‌ మీటర్లకు ఒక బిల్లు చొప్పున ఇస్తున్నారు. క్యూబిక్‌ మీటరుకు రూ.30 సీనరేజీ..చొప్పున 14 క్యూబిక్‌  మీటర్లకు రూ.420 చెల్లించాల్సి ఉంది. రాత్రివేళ బిల్లులు లేకుండా కంరను తరలిస్తూ టిప్పర్‌ కంకర దగ్గర రూ. 420 సీనరేజీకి గండికొడుతున్నారు. కంకర తవ్వకాలకు అనుమతులు మంజూరుచేసిన అధికారులు ఎన్ని క్యూబిక్‌ మీటర్లు తరలించేందుకు ఇచ్చారు. ఎన్నిరోజులకు ఆ బిల్లులు ఇచ్చిందీ స్థానిక రెవెన్యూ వర్గాలకు కూడా తెలియజేయడం లేదు. మరోవైపు కంకర తవ్వే భూమికి చెందిన రైతుకు పెద్దగా ప్రయోజనం ఉండని పరిస్థితి. ప్రభుత్వ వ్యవసాయం చేసుకొంటూ జీవనాధరం పొందడానికి ఇచ్చిన ఆ భూమి కంకర తవ్వకాలతో ఎందుకు పనికిరానిదిగా తయారవుతోంది.
పంచదార్లలో కంకర తవ్వకాలు జరుగుతున్న ప్రాంతంలో రీసర్వే సెటిల్‌మెంటు దస్త్రాల్లో సర్వేసంఖ్య-2 52.42 ఎకరాలు, సర్వేసంఖ్య-1 లో 543 ఎకరాలకు నిరుపేదలకు ‘డి’ పట్టాలు మంజూరు చేశారు. ఆ సర్వే సంఖ్యల్లో సబ్‌డివిజన్‌ చేసి పేదలకు మంజూరు చేసిన అసైన్డ్‌ భూముల్లో కంకర తవ్వకాలు జరుగుతున్నాయి. ఎలమంచిలి-గాజువాక రహదారికి ఆనుకొని ప్రభుత్వ, జిరాయతీ భూముల్లో సుమారు నాలుగు ఎకరాల విస్తీర్ణంలో కంకరను తవ్వేశారు. ఈ భూముల్లో తవ్విన కంకరను లెక్కిస్తే కొన్ని లక్షల క్యూబిక్‌ మీటర్లు ఉంటుంది. పది నుంచి 15 అడుగుల వరకు కంకర కోసం తవ్వేయడంతో ఎండిపోయిన జలాశయాలుగా కంకర తవ్విన గోతులు కనిపిస్తున్నాయి. గనుల శాఖ నిర్దేశించిన మేరకు ఏటవాలుగా కాకుండా నిలువుగా తవ్వేశారు. దీంతో పశువులను మేతకు తోలుకెళ్తే అందులో పడిపోయి మృత్యువాత పడతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్షాకాలం ప్రారంభం అవడంతో పంటపొలాల్లో మేతకు తోలుకెళ్లే పశువులు, జీవాలను కొండకే తోలాలని రైతులు అంటున్నారు. కొండకు మేతకు తోలుకెళ్తే కంకర గోతులతో భయమేస్తోందని కొందరు రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com