తెలంగాణలో రైతన్న ఆనందం 72 శాతం విస్తీర్ణంతో టాప్

తెలంగాణలో వానాకాలం పంటలు ఆశాజనకంగానే ఉన్నాయని అధికారిక సమాచారం స్పష్టం చేస్తోంది. ఇప్పటి వరకు దాదాపు 80 లక్షల ఎకరాల్లో రైతులు పంటలు వేశారు. వానాకాలంలో సాధారణంగా 110 లక్షల ఎకరాల్లో పంటలు వేస్తుంటారు. అంటే సాధారణ విస్తీర్ణంతో పోలిస్తే 72 శాతం విస్తీర్ణంలో పంటలు వేశారని స్పష్టమవుతోంది. నాగార్జునసాగర్ ఎడమ కాలువ కింద నల్లగొండ, ఖమ్మం, సూర్యాపేట జిల్లాలతో పాటు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టులోని జగిత్యాల, కరీంనగర్, వరంగల్ తదితర జిల్లాల్లో వరినాట్లు మందకొడిగా కొనసాగుతున్నాయి. నాగార్జునసాగర్, శ్రీరాంసాగర్‌లలోకి అవసరమైన నీరు వస్తే వరిసాగు పెరుగుతుందని అధికార వర్గాలు తెలిపాయి. రాష్ట్ర వ్యాప్తంగా 24 లక్షల ఎకరాల్లో వరిసాగు కావలసి ఉండగా, ఆరులక్షల ఎకరాల్లోనే ఇప్పటి వరకు వరినాట్లు పూర్తయ్యాయి. ఆగస్టు వరకు వరిసాగు కొనసాగుతూనే ఉంటుంది.సంగారెడ్డి, మెదక్, సిద్ధిపేట, జనగామ, యాదాద్రి, మేడ్చల్ జిల్లాల్లో వర్షాలు తక్కువగా ఉండటంతో ఈ జిల్లాల్లో పంటల పరిస్థితి కాస్త ఆందోళనకరంగా ఉంది. ఆదిలాబాద్, కొమురంబీం, పెద్దపల్లి, భద్రాద్రి జిల్లాల్లో సాధారణం కన్నా అధికంగా వర్షాలు కురిశాయి. మిగతా జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది.2018 జూన్, జూలై నెలల్లో రాష్ట్రం మొత్తంలో సరాసరిన 320 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావలసి ఉండగా, 311 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అంటే సాధారణ వర్షపాతం కంటే మూడు శాతం తక్కువగా వర్షపాతం నమోదైనట్టు తేలింది.నిజామాబాద్, మహబూబ్‌నగర్, కామారెడ్డి, వరంగల్ (పట్టణం), సిరిసిల్లా, ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్ జిల్లాల్లో 76 శాతం పైగా విస్తీర్ణంలో పంటలు వేశారు. సూర్యాపేట, వనపర్తి, పెద్దపల్లి జిల్లాల్లో 50 శాతంలోపు విస్తీర్ణంలో పంటలు వేశారు. మిగతా జిల్లాల్లో 51 శాతం నుండి 75 శాతం విస్తీర్ణంలో పంటలు వేశారు. రాష్ట్ర వ్యాప్తంగా విత్తనాలు వేయడం కొనసాగుతోందని, మరో 15 రోజులపాటు విత్తనాలు వేయడం, వరినాట్లు వేయడం కొనసాగుతోందని వ్యవసాయ శాఖ ప్రకటించింది. మిరప, పొద్దుతిరుగుడు, నువ్వులు తక్కువ విస్తీర్ణంలో వేశారు. తృణధాన్యాలైన జొన్న, సజ్జ, రాగులు కూడా తక్కువ విస్తీర్ణంలో వేశారు. వానలు కురిస్తే పంటల విస్తీర్ణం మరింత పెరుగుతుందని అధికార వర్గాలు వెల్లడించాయి.వానాకాలం పంటలకు సంబంధించి రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వ్యవసాయ శాఖ ముఖ్యకార్యర్శి సి. పార్థసారథి తెలిపారు. పెట్టుబడికి సంబంధించి రైతులు ఇబ్బంది పడకుండా ఇప్పటికే ఎకరానికి నాలుగువేల రూపాయల చొప్పున పెట్టుబడి ప్రోత్సాహాన్ని అందించామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు సేద్యానికి సంబంధించి సాంకేతిక సలహా ఇవ్వడానికి వీలుగా ఏఈఓలను నియమించామన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నామని వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com