తూర్పుగోదావరిలో జగన్ పై గురిపెట్టిన పవన్

ఇప్పుడు అందరి దృష్టి తూర్పు గోదావరి జిల్లాపైనే ఉంది. 19 శాసనసభ నియోజకవర్గాలున్న తూర్పు గోదావరి జిల్లాలో సత్తాను నిరూపించుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇటీవల వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర తూర్పు గోదావరిలోకి ప్రవేశించడమే రికార్డు సృష్టించింది. రాజమండ్రి రోడ్డు కం రైలు బ్రిడ్జి షేక్ అయ్యేలా పాదయాత్ర కొనసాగింది. ఈ దృశ్యాలను జాతీయ మీడియా కూడా ప్రసారం చేసింది. జగన్ పాదయాత్ర ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలోనే జరుగుతుంది. ఇప్పుడు అదే తరహాలో రోడ్డు కం రైలు బ్రిడ్జిపై కవాతు నిర్వహించాలని జనసేనాని భావిస్తున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. తూర్పు లోపర్యటించేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు. వైసీపీ అధినేత జగన్ కు మించి రోడ్డు కం రైలు వంతెనపై కవాతును నిర్వహించాలని జనసేనాని తన క్యాడర్ కు ఆదేశాలు జారీ చేశారట. ఆరోజు రైలు వంతెన ఊగిపోయేలా కవాతును నిర్వహించి తూర్పులో తన సత్తా ఏంటో నిరూపించుకోవాలని జనసేనాని భావిస్తున్నారు. ఇందుకోసం ముఖ్య నేతలతో సమావేశమైన పవన్ వంతెనపై కవాతు కార్యక్రమాన్ని ఎలా నిర్వహించాలో వివరించారు. ఈ సందర్భంగా డ్రోన్ కెమెరాలతో పాటు సినీ షూటింగ్ లకు వినియోగించే అత్యాధునిక కెమెరాలను వినియోగించనున్నారు.తూర్పు గోదావరి జిల్లాలోకి జగన్ పాదయాత్ర ప్రవేశించడమే జాతీయ స్థాయిలో ప్రచారం లభించింది. ఇదే ప్రచారాన్ని ఇప్పుడు జనసేనాని కూడా కోరుకుంటున్నారు. గత ఎన్నికలలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ మద్దతు ఇవ్వడం వల్లనే తెలుగుదేశం పార్టీ అత్యధిక స్థానాలను విజయం సాధించింది. మొత్తం 19 నియోజకవర్గాలు ఉంటే…అందులో 12 స్థానాలను తెలుగుదేశం పార్టీ నేరుగా గెలుచుకుంది. ఒక స్థానంలో మిత్రపక్షమైన బీజేపీ, మరొకస్థానమైన పిఠాపురంలో స్వతంత్ర అభ్యర్ధిగా గెలిచిన వర్మ తర్వాత తెలుగుదేశంలో చేరిపోయారు. దీంతో టీడీపీ 14 స్థానాలను గెలుచుకున్నట్లయింది. వైసీపీకి కేవలం ఐదు స్థానాలే దక్కాయి. ఆ తర్వాత అందులోనూ ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీని వీడి టీడీపీలో చేరడంతో టీడీపీ ప్రస్తుత బలం 17 అయింది. వైసీపికి ఇద్దరు సభ్యులే ఉన్నారు. ఈ నేపథ్యంలో పవన్ తన ప్రభావాన్ని చూపాలనుకుంటున్నారు.జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్ని జిల్లాల్లో పోటీచేస్తామని ఇప్పటికే ప్రకటించారు. వామపక్షాలతో పొత్తు ఉండే అవకాశముంది. అయితే తూర్పు గోదావరి జిల్లాలో అన్ని స్థానాల్లో జనసేన అభ్యర్థులే పోటీ చేయాలని పవన్ భావిస్తున్నారు. కమ్యునిస్టులకు పెద్దగా అవకాశం లేకపోవడంతో అన్ని స్థానాల్లో జనసేన పోటీ చేస్తుందని ఇప్పటికే ఆ జిల్లా నేతలకు పవన్ క్లారిటీ ఇచ్చారని చెబుతున్నారు. అయితే పవన్ పాదయాత్ర జిల్లాలోకి ప్రవేశించిన తర్వాత సున్నిత సమస్యను అడ్రెస్ చేయాల్సి ఉంటుంది. కాపు రిజర్వేషన్లపై జనసేనాని ఖచ్చితంగా స్పందించాల్సి ఉంటుంది. అయితే ఇప్పటికే జగన్ కాపు రిజర్వేషన్లపై స్పష్టమైన ప్రకటన చేయడంతో పవన్ దీనిపై ఎలాంటి స్టేట్ మెంట్ ఇస్తారోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. జగన్ బాటలోనే పవన్ కూడా పయనించే అవకాశముందిని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com