జైలు చూడడంతోనే అప్పులు కట్టేస్తానన్నాడు

లండన్, ఆగస్టు 1 (న్యూస్ పల్స్)
భారతీయ బ్యాంకులకు రూ. 9000 కోట్ల రుణాలు ఎగ్గొట్టి లండన్ పారిపోయిన కింగ్ ఫిషర్ అధినేత విజయ్ మాల్యా కేసును యూకేలోని వెస్ట్‌మినిస్టర్ కోర్టు విచారించింది. ఈ సందర్భంగా మాల్యాను ఉంచబోయే జైలు వీడియో ఇవ్వాలని భారత్‌ను కోర్టు కోరింది. భారత అధికారులు సమర్పించిన ముంబై ఆర్థర్ రోడ్ జైలు ఫొటోలను మాత్రమే చూసి తాము నిర్ణయం తీసుకోలేమని జడ్జి ఎమ్మా ఆర్బత్‌నాట్ స్పష్టంచేశారు. ఫొటోలో కనిపిస్తున్న డోర్ నుంచి లోనికి వెళ్లి అక్కడి పరిస్థితులను మొత్తం వీడియో తీయాలని ఆమె సూచించారు. సెప్టెంబర్ 12లోగా ఆ వీడియోను అందజేయాలని ఆదేశించారు. మనీ లాండరింగ్, మోసం అభియోగాలను ఎదుర్కొంటున్న విజయ్ మాల్యాను భారత్‌కు అప్పగించాలని వేసిన పిటిషన్‌పై లండన్ కోర్టు విచారణ జరుపుతోంది. భారతీయ బ్యాంకులకు బకాయిపడ్డ రుణాలను చెల్లించడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు కోర్టుకు మాల్యా తెలిపారు. కేసును పరిష్కరించాల్సిందిగా కోర్టును కోరినట్లు తెలిపారు. తన పేరిట ఉన్న రూ.14,000 కోట్ల ఆస్తులను అమ్మకానికి పెట్టి భారతీయ బ్యాంకులకు రుణాలు చెల్లిస్తానని మాల్యా చెప్పారు. విచారణను ఎదుర్కొనేందుకు తన కుమారుడు సిద్ధార్థ్‌తో కలిసి ఆయన వెస్ట్‌మినిస్టర్‌ కోర్టుకు హాజరయ్యారు. బ్యాంకులకు వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టి లండన్‌ పారిపోయిన మాల్యాను భారత్‌ రప్పించేందుకు అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com