జేబుకు చిల్లే

జిల్లాలోని సినిమా థియేటర్లలోని క్యాంటీన్లు అధిక ధరలు వసూలు చేయడంతో జేబులు ఖాళీ అవుతున్నాయి. వినోదం కోసం వచ్చిన ప్రేక్షకులు గుక్కెడు శుద్ధి చేసిన మంచినీళ్లు లేక బిక్కమొహం వేస్తున్నారు. టికెట్‌ ధరలు విపరీతంగా వసూలు చేస్తున్న థియేటర్‌ యాజమాన్యాలు కనీస సౌకర్యాలు కల్పించకపోగా తినుబండారాలు, వాటర్‌ ప్యాకెట్లు, పార్కింగ్‌లపై ఎక్కువ వసూలు చేస్తూ ప్రేక్షకులకు నిజంగా ‘సినిమా’ చూపిస్తున్నారు.
ఆదిలాబాద్‌ పట్టణంలో నాలుగు సినిమా థియేటర్లు ఉన్నాయి. సినిమా చూడటానికి పరిసర గ్రామీణ ప్రాంతాల నుంచి నిత్యం ఎంతోమంది వస్తుంటారు. రోజుకు ఒక థియేటర్‌కు సుమారు 800 మంది ప్రేక్షకులు వస్తుంటారు. కొత్త సినిమా విడుదల అయితే ఆ సంఖ్య ఇంకా పెరుగుతుంది. సినిమాకు వెళ్లిన ప్రేక్షకులకు తాగునీటి వసతితో పాటు కనీస సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత థియేటర్‌ యాజమాన్యంపై ఉంటుంది. కాని నిర్వాహకుల నిర్లక్ష్యంతో ప్రేక్షకుడే సొంత డబ్బుతో నీటిని కొనుగోలు చేసుకొని తాగాల్సిన పరిస్థితి. వచ్చిన వారికి సరైన తాగునీటి సౌకర్యం కల్పిస్తే మినరల్‌ వాటర్‌ సీసాలను ఎవరూ కొనుగోలు చేయరనే ఉద్దేశంతో కావాలనే థియేటర్‌ యజమానులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. థియేటర్లలో తాగునీటి కోసం ఏర్పాటు చేసిన ప్రాంతాలు నాచుతో అపరిశుభ్రంగా ఉన్నాయి. ఆ పరిసరాలు చూసిన వారు అక్కడ తాగడానికే భయపడుతున్నారు.
పట్టణంలోని పంజాబ్‌ చౌరస్తాకు సమీపంలో గల రెండు థియేటర్‌లలో ద్విచక్ర వాహనం, ఆటో నిలిపి ఉంచడానికి రూ.20, కారుకి రూ.30 వసూలు చేస్తున్నారు. సినిమారోడ్డులో గల ఒక థియేటర్‌లలో ద్విచక్ర వాహనానికి రూ.15, ఆటో, కారుకి రూ.30 వసూలు చేస్తున్నారు. ఆంధ్రాబ్యాంకుకు సమీపంలో మరో థియేటర్‌లో ఆటో, ద్విచక్ర వాహనానికి రూ.20, కారుకు రూ.30 వసూలు చేస్తున్నారు. ఈ నాలుగు థియేటర్లలో ఎక్కడా వాహనాలు నిలిపే చోట షెడ్డు ఏర్పాటు చేయలేదు. వాహనాలకు రక్షణ కూడా లేని పరిస్థితి.  కొన్ని చోట్ల రూ.50 సైతం వసూలు చేస్తున్నారు. వాహనాల పార్కింగ్‌ వసూలు పై చూపిస్తున్న శ్రద్ధ కనీస సౌకర్యాలు అందించడంలో మాత్రం చూపడం లేదు.
థియేటర్‌లలో మంచి సినిమాలు ఆడుతున్నట్లుయితే ఒక ప్రభుత్వ ఉద్యోగి కుటుంబ సభ్యులతో కలిసి నెలకు మూడు సార్లు సినిమాకు వెళ్లడానికి అవకాశం ఉంది.  ఈ లెక్కన నెలలో మూడు సార్లు సినిమాకు వెళ్లాల్సి వస్తే రూ.1,140 ఖర్చు చేయాల్సి వస్తోంది. నెల జీతం సుమారు రూ.35 వేలు వచ్చిన అందులో రూ.1,440ను ప్రతి నెల తన వేతనం నుంచి ఖర్చు చేయాల్సి వస్తోంది. సాధారణ ఉద్యోగుల పరిస్థితి చెప్పనక్కర్లేదు. క్యాంటీన్‌లో అల్పాహారం, శీతలపానియాలు, నీటి సీసాల కొనుగోలులో అదనపు వసూలు నియంత్రించడంతో పాటు వాహనాల పార్కింగ్‌ను పూర్తిగా ఎత్తివేస్తే సుమారు రూ.160 వరకు ప్రేక్షకులపై భారం తగ్గుతుంది.
థియేటర్‌లలో తినుబండారాలు, పానీయాలు, వాటర్‌ ప్యాకెట్లు, వాటర్ బాటిల్ ధరలు ఎక్కువగా ఉంటున్నాయి. ప్రతి కొనుగోలుపై అదనంగా వసూలు చేస్తున్నారు. సినిమా చూడటానికి కుటుంబంతో వచ్చిన ప్రేక్షకులు ధరలు ఎక్కువగా ఉన్నా చేసేది ఎమీ లేక కోనుగోలు చేయాల్సి వస్తోదంటున్నారు. తాగే నీటి ప్యాకెట్‌కు రూ.3లు వసూలు చేస్తున్నారు. అయనా ఒక ప్యాకెట్‌ కొనుగోలు చేస్తే ఇవ్వరు. తప్పకుండా రెండు మూడు ప్యాకెట్లు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ప్రేక్షకులు కూర్చునే సీట్ల నిర్వహణ కూడా అంత మాత్రంగానే ఉంటుంది. ప్రేక్షకులకు కల్పించాల్సిన సదుపాయాలను యాజమానులు విస్మరిస్తున్న సినిమా థియేటరులను తరచూ తనిఖీలు నిర్వహించి సదుపాయాలను పరిశీలించాల్సిన అధికారులు అసలే పట్టించుకోవడం లేదు. అధికారులు తనిఖీలు నిర్వహించి సదుపాయాలు మెరుగు పరచాలని ప్రేక్షకులు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com