ఖమ్మంలో పొలిటికల్ వార్ షురూ…

ఖమ్మం జిల్లాలో మాత్రం రాజకీయ సెగ ప్రారంభమైంది. ఎప్పుడు ఎన్నికలొచ్చినా సిద్ధంగా ఉండాలంటూ ఆయా రాష్ట్ర పార్టీల సూచన మేరకు పలు పార్టీలు తమ కార్యకలాపాలను వేగవంతం చేస్తున్నాయి. జిల్లా, నియోజకవర్గ కేంద్రాల్లో ప్రారంభమైన సందడితో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. గెలుపు గుర్రాల కోసం.. పూర్వ వైభవం కోసం.. సత్తా చాటేందుకు ఎవరికి వారే వ్యూహ ప్రతివ్యూహాలు పన్నుతున్నారు. టీడీపీ సైతం వచ్చే ఎన్నికల్లో ఉనికి చాటుకునేందుకు తాపత్రయ పడుతోంది. కాంగ్రెస్‌ వంటి పార్టీలతో ఎన్నికల పొత్తే మేలన్న భావనతో పార్టీ కార్యకర్తలకు నచ్చజెప్పేందుకు యత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక జిల్లాలో బలమైన రాజకీయ పక్షాలుగా పేరున్న ఉభయ కమ్యూనిస్టు పార్టీలు ఈసారి ఎన్నికల్లో ఎటువంటి వ్యూహం రచిస్తారనేది చర్చనీయాంశంగా మారింది. 2014లో జరిగిన ఎన్నికల్లో ఉభయ కమ్యూనిస్టులు వేర్వేరు పార్టీల మద్దతుతో జిల్లాలో ఎన్నికల బరిలోకి దిగగా.. ఈసారి కూడా అదే పరిస్థితి ఆవిష్కృతమయ్యే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.సీపీఎం బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌(బీఎల్‌ఎఫ్‌) కూటమితో కలిసి ఎన్నికల బరిలోకి దిగనుండగా.. సీపీఐ.. కాంగ్రెస్‌తో మరోసారి ఎన్నికల మైత్రి కొనసాగించే అవకాశం ఉన్నట్లు ప్రచారమవుతోంది. దీంతో కాంగ్రెస్‌ తరఫున కొత్తగూడెం నుంచి టికెట్‌ ఆశిస్తున్న ఆశావహుల్లో ఉత్కంఠ కలుగుతోంది. ఎన్నికల పొత్తులో ఏ నియోజకవర్గం ఎటువైపు వెళ్తుందో అనే అంశం ఒక పట్టాన తేలకపోవడంతో ఆయా నియోజకవర్గాలపై తమ పట్టు సడలకుండా పార్టీ కార్యకలాపాలను ఎవరికి వారే హోరాహోరీగా కొనసాగిస్తున్నారు. గత ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒకే ఒక్క స్థానం గెలుచుకున్న టీఆర్‌ఎస్‌.. ఈసారి పది నియోజకవర్గాల్లో పాగా వేసేందుకు పావులు కదుపుతోంది. గత ఎన్నికల్లో కొత్తగూడెం నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన జలగం వెంకటరావు విజయం సాధించారు. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో జిల్లాకు చెందిన తుమ్మల నాగేశ్వరరావు టీడీపీకి రాజీనామా చేసి.. 2014లో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఆయన వెంట జెడ్పీ చైర్‌పర్సన్, ఎమ్మెల్సీ, డీసీసీబీ చైర్మన్‌ వంటి నేతలు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు కొండబాల కోటేశ్వరరావు వంటి నేతలు గులాబీ గూటికి చేరగా.. కాంగ్రెస్‌ నుంచి గెలుపొందిన ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్‌ టీఆర్‌ఎస్‌లో చేరారు.పాలేరు నుంచి గెలుపొందిన మాజీ మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి అనారోగ్యంతో మరణించారు. దీంతో 2014 ఎన్నికల్లో నాలుగు ఎమ్మెల్యే స్థానాలను గెలుపొందిన కాంగ్రెస్‌కు.. ప్రస్తుతం మధిర ఎమ్మెల్యే, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క మాత్రమే జిల్లాలో మిగిలారు. పాలేరులో జరిగిన ఉప ఎన్నికల్లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు టీఆర్‌ఎస్‌ తరఫున గెలుపొందారు. ఇక గత శాసనసభ ఎన్నికల్లో జిల్లాలో వైఎస్సార్‌ సీపీ విజయఢంకా మోగించింది. ఖమ్మం ఎంపీతోపాటు వైరా, అశ్వారావుపేట, పినపాక ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకుంది ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డితోపాటు పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, అశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, వైరా ఎమ్మెల్యే బానోత్‌ మదన్‌లాల్‌ రాజకీయ పరిణామాల నేపథ్యంలో వేర్వేరుగా టీఆర్‌ఎస్‌లో చేరారు. ప్రస్తుతం టీఆర్‌ఎస్‌కు జిల్లాలో ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్నట్లయింది. దీంతో వచ్చే ఎన్నికల్లో వీటిని నిలబెట్టుకోవడంతోపాటు రాజకీయంగా అత్యంత కీలకంగా, ప్రతిష్టాత్మకంగా భావించే సత్తుపల్లి, మధిర, భద్రాచలం నియోజకవర్గాల్లో సైతం గులాబీ జెండా ఎగరేసేందుకు టీఆర్‌ఎస్‌ కసరత్తు ప్రారంభించింది. ఆయా నియోజకవర్గాలపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రత్యేక దృష్టి సారించడం.. తరచూ రాజకీయ పర్యటనలు చేస్తూ పార్టీశ్రేణుల్లో ఉత్తేజం నింపే ప్రయత్నం చేస్తున్నారు.కాంగ్రెస్, టీడీపీ, సీపీఎం, సీపీఐ, సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ వంటి రాజకీయ పక్షాలు తమకు పట్టున్న నియోజకవర్గాలపై ఇప్పటికే దృష్టి సారించారు. ఎన్నికల్లో గెలిచేందుకు అవసరమైన వ్యూహ ప్రతివ్యూహాలు రూపొందిస్తుండగా.. అందుకు దీటుగా అధికార పార్టీ జిల్లాలో అన్ని ఎమ్మెల్యే స్థానాలు, రెండు లోక్‌సభ స్థానాలను కైవసం చేసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. టీఆర్‌ఎస్‌ కొద్ది రోజులుగా రాజకీయంగా దూకుడు పెంచింది. ప్రతిపక్ష కాంగ్రెస్‌ నేత మల్లు భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర నియోజకవర్గంపై పూర్తిస్థాయి దృష్టి సారించింది. ఆయా మండలాల నుంచి వివిధ పార్టీలకు చెందిన ద్వితీయ శ్రేణి నేతలను టీఆర్‌ఎస్‌లో చేర్చుకోవడం ద్వారా మధిరలో తమకు సానుకూల పవనాలు వీస్తున్నాయన్న భావన కల్పించే ప్రయత్నం చేస్తుందన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో కలుగుతోంది. ఇక పది అసెంబ్లీ నియోజకవర్గాలు, రెండు పార్లమెంట్‌ స్థానాల్లో టీఆర్‌ఎస్‌ విజయ పతాకం ఎగురవేసే బాధ్యతను తానే తీసుకుంటానని మంత్రి తుమ్మల స్వయంగా ప్రకటించడంతో పార్టీ రాజకీయ వ్యూహాలకు పదును పెట్టిందన్న అభి ప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ఇప్పటికే నియోజకవర్గాల్లో పర్యటిస్తూ.. తమ బలాలు, బలహీనతలపై దృష్టి సారించి ఎన్నికల ప్రచార పర్వానికి అందరికంటే ముందు సిద్ధమవుతున్నారన్న భావన కలుగుతోంది. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జిల్లాలో జరిగిన అభివృద్ధిని క్షేత్రస్థాయికి తీసుకెళ్లడంతోపాటు జిల్లాలోని టీఆర్‌ఎస్‌యేతర రాజకీయ పక్షాల్లో పెల్లుబుకుతున్న అసంతృప్తులు, కీలక నేతల వ్యవహార శైలి, ఆయా పార్టీలతో వారు అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్న తీరుపై ప్రత్యేక దృష్టి సారించింది.ఈ మేరకు ఆయా నియోజకవర్గాల్లో రాజకీయంగా జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు మంత్రి తుమ్మలకు చేరవేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. జిల్లాలోని టీఆర్‌ఎస్‌లో నెలకొన్న పరిస్థితులపై మంత్రి ఆయా నియోజకవర్గాల నేతల ద్వారా ఆరా తీయడంతోపాటు పార్టీ నేతలకు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ పరంగా నెలకొన్న జఠిల సమస్యలపై దృష్టి సారించేందుకు పార్టీ యంత్రాంగం సమాయత్తమైనట్లు తెలుస్తోంది. జిల్లాలో జనరల్‌ స్థానాలుగా ఉన్న పాలేరు, ఖమ్మం, కొత్తగూడెం, ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు తుమ్మల నాగేశ్వరరావు, పువ్వాడ అజయ్‌కుమార్, జలగం వెంకటరావు, ఖమ్మం ఎంపీగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తుండగా.. అక్కడ తిరిగి విజయం సాధించేందుకు ఆయా నేతలు ఇప్పటి నుంచే చెమటోడుస్తున్నారు. నియోజకవర్గాల్లో జరిగే ప్రతి కార్యక్రమంలో పాల్గొనడంతోపాటు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు తాము ఇస్తున్న ప్రాధాన్యాన్ని చాటిచెప్పుకునే ప్రయత్నం చేస్తుండటం గమనార్హం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com