కడప జిల్లాకు ఉక్కు పరిశ్రమ రావడం జగన్‌కు ఇష్టం లేదు

కడప జిల్లాకు ఉక్కు పరిశ్రమ రావడం ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌కు ఇష్టం లేదని తెదేపా రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్‌ అన్నారు. కడప జిల్లాలో ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు చొరవ తీసుకోవాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని ఆజిల్లాకు చెందిన ఎంపీలు, ఐకాస నేతలు కోరారు. ఢిల్లీలోని ఆయన నివాసంలో వెంకయ్యను కలిసిన నేతలు.. విభజన చట్టంలోని హామీలను కేంద్ర ప్రభుత్వం విస్మరిస్తోందని వివరించారు. కడప ఉక్కు కర్మాగారానికి సంబంధించిన వినతిపత్రాన్ని ఆయనకు అందజేశారు
అనంతరం సీఎం రమేశ్‌ మీడియాతో మాట్లాడుతూ… ‘కడప జిల్లా నుంచి ప్రజాప్రతినిధులు, ఐకాస నేతలందరం కలిసి ఉపరాష్ట్రపతిని కలిసి వినతిపత్రం అందజేశాం. ఆయనకు అన్ని విషయాలు తెలిసినందున ఈ అంశంలో చొరవ తీసుకుని పరిష్కరించేలా చేయాలని కోరాం. ఉక్కు కర్మాగారంపై జిల్లాలో ఆందోళనలు జరుగుతున్నాయ. నేను కూడా దీక్ష చేశాను. ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రానికి రెండు ఆప్షన్లు ఇచ్చారు. దీనిపై కేంద్రం ఏదొకటి నిర్ణయం తీసుకోవాలి. పార్లమెంటు ఉభయసభల్లో దీనికి సంబందించి కేంద్ర ప్రభుత్వ వివరణ సరిగా లేదు. కడప జిల్లాలో అన్ని వనరులు ఉన్నాయి. రోడ్డు, రైలు మార్గాలు అందుబాటులో ఉన్నాయని… ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు ఈ జిల్లా అనువైనదన్న విషయాన్ని ఉపరాష్ట్రపతికి వివరించాం. దీనికి ఆయన స్పందిస్తూ తన పరిధిలో ఉన్నంతవరకు మంత్రితో మాట్లాడి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కోసం మేం చేయగలిగినదంతా చేస్తాం. ఉపరాష్ట్రపతిని కలిసేందుకు తమతో రావాలని వైకాపా నేతలను కోరగా వారు స్పందించలేదు. కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ రావడం జగన్‌కు ఇష్టం లేదు. కడప జిల్లా ప్రజలు బాగుపడటం ఆయనకిష్టం లేదు. ఉక్కు పరిశ్రమ వస్తే ఆ క్రెడిట్‌ అంతా తెలుగుదేశానికే వెళ్లిపోతుందడని జగన్‌ ఆందోళన చెందుతున్నారు. ఈ విషయాన్ని ప్రజలంతా గమనిస్తున్నారు’ అని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *