ఏపీలో ముక్కోణమే

రాష్ట్ర రాజకీయాల్లో మరో మూడు నెలలు శాంతియుత రాజకీయాలు ఉంటాయని ఆ తరువాతే భారీ మార్పులు చోటు చేసుకుంటాయని రాజకీయ నాయకులు వెల్లడిస్తున్నారు. నేతల పార్టీ ఫిరాయింపులు, రాజకీయ పార్టీల కొత్త స్నేహాలు కూడా అక్టోబర్ తరువాతే చిగురిస్తాయని వారు స్పష్టం చేస్తున్నారు. లోక్‌సభ, రాష్ట్ర శాసన సభకు వచ్చే ఏడాది మే నెల వరకు గడువు ఉన్నా బీజేపీ ముందస్తు ఎన్నికలకు ప్రణాళికలు రచిస్తుండటం, ఎన్నికల కమిషన్ కూడా వేసవిలో కాకుండా ఫిబ్రవరిలో ఎన్నికల ప్రక్రియ ముగించాలన్న భావనతో ఉన్నాయని అందువల్ల లోక్‌సభ, రాష్ట్ర శాసనసభలకు జనవరి, ఫిబ్రవరిలో ఎన్నికలు ఖాయమని దాదాపు అన్ని పార్టీల నాయకులు ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీంతో రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు రానున్న అక్టోబర్ నుంచి ఎన్నికల దిశగా ఎత్తులు, పై ఎత్తులకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. అధికార తెలుగుదేశం పార్టీ చేపట్టిన గ్రామదర్శిని కార్యక్రమం అక్టోబర్ మొదటి వారంలో ముగియనుంది. ఇక అధికారుల గ్రామవికాసం కార్యక్రమం కూడా త్వరలో ప్రారంభించేందుకు జిల్లా కలెక్టర్లకు కొన్ని ప్రత్యేక అధికారాలను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలుస్తోంది. గ్రామదర్శిని కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చే వినతులపై అధికారులు నిర్ణయం తీసుకుని ఆయా గ్రామాలకు వెళ్లి వారి సమస్యలకు పరిష్కారం చూపనున్నారు. గ్రామవికాసం కార్యక్రమం అక్టోబర్ చివరి నాటికి పూర్తి కానుందని టీడీపీ నేతలు వెల్లడిస్తున్నారు. ఇక ప్రతిపక్ష వైసీపీ అధినేత ప్రస్తుతం చేస్తున్న పాదయాత్ర సెప్టెంబర్ చివరి వరకు కొనసాగనుంది. ఆయన ఆ తరువాత రాజకీయ ఎత్తులపై పార్టీ నాయకులతో చర్చించనున్నారు. పార్టీ 2019లో అధికారంలోకి రావడానికి తీసుకోవాల్సిన చర్యలపై జగన్ ఒక నిర్ణయానికి రానున్నట్లు ఆ పార్టీ నేతలు వెల్లడిస్తున్నారు. మరోవైపు కొత్తగా ఏర్పడిన జనసేన పార్టీ అధినేత ప్రస్తుతం జిల్లాల పర్యటనలో ఉన్నారు. ఆయన కూడా సెప్టెంబర్ నాటికి జిల్లాల పర్యటన పూర్తి చేసుకుని అన్ని జిల్లాల్లో పార్టీ కమిటీలను ఏర్పాటు చేసే అవకాశముంది. ఆ తరువాత విజయవాడ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఎన్నికలను ఎదుర్కొనడానికి సమాయత్తం కానున్నట్లు స్పష్టమవుతోంది. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో పూర్తి స్థాయి వేడి రగిలేది అక్టోబర్ నుంచేనని రాజకీయ నాయకులు పేర్కొంటున్నారు. అప్పటికి అన్ని పార్టీలు రాష్ట్రంలో ప్రజాభిప్రాయం ఎలా ఉందో సర్వేల ద్వారా తెలుసుకొని ఆ మేరకు పార్టీల బలోపేతానికి చర్యలు తీసుకుంటారని వారంటున్నారు.
ఇక పార్టీ ఫిరాయింపులు కూడా అక్టోబర్ తరువాత భారీగా ఉంటాయని కూడా వారంటున్నారు. తాము ఉన్న పార్టీకి గెలిచే అవకాశం లేదని తెలిసినా, గెలిచే అవకాశమున్నప్పటికీ తనకు టికెట్ రాదని తేలినా నేతలుపార్టీ ఫిరాయించే అవకాశాలు ఉన్నాయని వెల్లడిస్తున్నారు. అంతేగాక జనసేన విధానాలు అక్టోబర్ నాటికి వెల్లడవుతాయని, దీంతో ఆ పార్టీలో అవకాశం లభిస్తే చేరడానికి మరి కొందరు సిద్ధపడతారని స్పష్టమవుతోంది. ఇక రాజకీయ పార్టీల పరంగా కూడా కొత్త స్నేహాలకు అంకురార్పణ కూడా అక్టోబర్ తరువాతే ఉంటుందని నేతలు వెల్లడిస్తున్నారు. గత ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన టీడీపీ, బీజేపీ రానున్న ఎన్నికల్లో పోటీచేసే అవకాశం లేదని దాదాపు తేలిపోయింది. అంతేగాక టీడీపీ కాంగ్రెస్ పార్టీలో అవగాహనకు వచ్చి ఎన్నికలకు వెళ్తుందని కూడా ప్రచారం సాగుతోంది. ఇక బీజేపీతో స్నేహం చేయనుందన్న నేపథ్యంలో వైకాపా ఎత్తులు ఏంటన్నది కూడా అదే నెలలో స్పష్టత వచ్చే వకాశముందని భావిస్తున్నారు. బీజేపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వని పక్షంలో వైకాపా, కమలం చెలిమి సాధ్యం కాకపోవచ్చని అంచనా వేస్తున్నారు.
ఇదే జరిగితే రానున్న ఎన్నికల్లో కూడా వైకాపా ఒంటరిగానే బరిలోకి దిగుతుందన్న చర్చ కూడా కొనసాగుతోంది. అయితే జాతీయ స్థాయిలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తుందన్న నమ్మకం కలిగితే వైకాపా ఆలోచనలో మార్పు రావచ్చని నాయకులు లెక్కలు వేస్తున్నారు. కొత్త పార్టీ జనసేన కూడా రానున్న ఎన్నికల్లో ఎవరితోనూ కలిసే అవకాశం లేదని రాజకీయ నాయకులు భావిస్తున్నారు.
ఆ పార్టీ రాష్ట్రంలోని అన్ని స్థానాలకు పోటీ చేసే అవకాశం కూడా లేదని, పార్టీ బలంగా ఉందన్న స్థానాల్లోనే పోటీ చేస్తుందన్న అంచనాలో వారున్నారు. జనసేన 75 శాసనసభ స్థానాలు, 10 లోక్‌సభ స్థానాలకు మించి పోటీ చేయకపోవచ్చని చర్చించుకుంటున్నారు. అక్టోబర్ తరువాతే ఆయా రాజకీయ పార్టీల తీరులో స్పష్టత వస్తుందని పేర్కొంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *