గుంటూరు జిల్లాలో ఎన్నికల వేడి

జిల్లాలో అప్పుడే ఎన్నికల వేడి కనిపిస్తోంది. రాష్ట్రంలో అధికార తెలుగుదేశంతో పాటు ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్‌ కాంగ్రెస్‌, కొత్తగా ఏర్పాటైన జనసేన, జాతీయ పార్టీలుగా ఉన్న భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్‌, వామపక్ష పార్టీలు రానున్న ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నాయి. ప్రధాన పార్టీలను మినహాయిస్తే మిగిలిన పార్టీలకు జిల్లాలోని అన్ని స్థానాల్లో అభ్యర్థులు దొరకడం కష్టమనే పరిస్థితి ప్రస్తుతం ఉంది. ముఖ్యంగా జాతీయ స్థాయి లో చక్రం తిప్పే భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్‌లు సైతం ఆయా పార్టీల తరపున పోటీచేసేందుకు అభ్యర్థులను వెతుకులాడు కోవాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుత రాజకీయాల నేపథ్యంలో ఇక వామపక్షాలు అయితే పోటీకి ఎంతదూరంగా ఉంటాయో చెప్పలేని పరిస్థితి.
రాష్ట్రంలో ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్న టీడీపీ, వైసీపీ తరపున పోటీ చేసేందుకు అనేకమంది ఔత్సాహికులు ముందుకు వస్తున్నారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు లేనిచోట్ల అయితే ఈ పార్టీల తరపున బరిలోకి దిగేందుకు ఐదుగురు నుంచి పది మంది దాకా పోటీపడుతున్నారు. ఇక సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు ఉన్నచోట తమకు అవకాశం రాకపోతుందా అని ఎదురుచూసే ఆశావహులకూ కొదవలేదు. నియోజకవర్గాల నుంచి రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్న ఒకరిద్దరు నాయకులు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం లోనూ సీటుకోసం ఆశావహదృక్పథంతో ఉన్నారు. ప్రధాన పార్టీల పరిస్థితి ఇలావుంటే, కొత్తగా ఏర్పాటైన జనసేన తరపున పోటీ చేసేందుకు ఔత్సాహికులు ముందుకు వస్తున్నారు. ముఖ్యంగా సామాజిక బలం అధికంగా ఉన్నచోట ఆయా నాయకులు తమకు టిక్కెట్‌ ఇవ్వాలని ఇప్పటి నుంచి జనసేన అధినేతను కోరుతున్నట్లు తెలుస్తోంది.
జాతీయ స్థాయిలోనే కాకుండా 2014 ఎన్నికల వరకు రాష్ట్రంలోనూ ప్రధాన పార్టీగా ఉన్న కాంగ్రెస్‌ ఈ దఫా అభ్యర్థుల కోసం గాలించాల్సిన పరిస్థితి ఉంది. ఇందుకోసం ఇప్పటి నుంచే ఆ పార్టీ జాతీయ స్థాయి నాయకులు ప్రయత్నాలు ప్రారంభించారు. పార్టీ నుంచి బయటకు వెళ్లిన వారిని తిరిగి పార్టీలో చేర్చుకోవడంతో పాటు కొత్త వారిని పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజన నేపథ్యంలో తగిలిన దెబ్బ నుంచి ఆ పార్టీ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఇందులో భాగంగానే తాము చేసిన తప్పు దిద్దుకుంటామని, తమకు అవకాశం ఇస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చి నష్టాన్ని పూడుస్తామని హామీ ఇస్త్తున్నారు. అయితే దీన్ని నమ్మి ఆ పార్టీ తరపున ఎంత మంది పోటీ చేసేందుకు ముందుకు వస్తారో వేచిచూడాల్సి ఉంది.
ఇక మరో జాతీయ పార్టీ ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సైతం జిల్లాలో అసెంబ్లీ అభ్యర్థుల కోసం కసరత్తు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. గతంలో పొత్తుల సమయంలోనే బీజేపీకి ఇచ్చిన ఒక్క సీటు ఆ పార్టీ గెలుచుకోలేక పోయింది. ఆ సమయంలో బీజేపీపై ఎలాంటి వ్యతిరేకత లేదు. అయినా ఆ పార్టీ ప్రత్యేక హోదా విషయంలో నమ్మించి మోసం చేసిందనే భావన ఇప్పుడు ప్రజల్లో ఉంది. ఇక ఇప్పుడు టీడీపీతో సైతం స్నేహబంధం తెగతెంపులు అయ్యాయి. ఈ తరుణంలో బీజేపీ తరపున పోటీ చేసేందుకు ఎవరూ ముందుకు రాలేని పరిస్థితి. అయితే ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ గుంటూరు జిల్లా వ్యక్తి కావడంతో ఆయన బరిలోకి దిగడమే కాకుండా మరికొంత మంది అభ్యర్థులను బరిలోకి దించేందుకు అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com