ఆర్టీసీలో పన్మిషెంట్ల బంద్

నెల్లూరు, ఆగస్టు1 (న్యూస్ పల్స్)
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రవాణా సంస్థ  లో విధి నిర్వహణ కత్తిమీద సాము. బస్సు డిపో నుంచి బయటకు తీసినప్పటి నుంచి మళ్లీ లోపలికి తీసుకెళ్లేవరకు కార్మికులకు క్షణక్షణం పరీక్షలాంటిదే. చార్జీల వసూళ్లలో ఒక్క రూపాయి తగ్గినా, తనకు తెలియకుండా బస్సుకు చిన్న గీత పడినా శిక్షలు పెద్దవిగా ఉండేవి. చిన్న తప్పిదాలకు పెద్ద శిక్షలు పడడంతో కార్మికులతో పాటు కుటుంబసభ్యులూ మానసికంగా క్షోభను అనుభవించేవారు. ఇదంతా గతం. ప్రస్తుతం యాజమాన్యం కార్మికుడు ఆరు తప్పులు చేసినా శిక్షలు వేయకుండా వెసులుబాటు కల్పించింది. చిన్నచిన్న పొరపాట్లకు శిక్షలు వేయకుండా పాయింట్లు కేటాయిస్తుంది. ఆరు తప్పిదాల వరకు ఇంక్రిమెంట్లలో కోత విధించడం, ఏడు తప్పుల తర్వాత విధుల నుంచి తొలగిస్తారు. నిర్ణీత పాయింటు ముగిసిన తర్వాత శిక్షలు అమలు చేస్తారు. కార్మికులకు శిక్షలు తగ్గిస్తూ ఆర్టీసీ ఎండీ సురేంద్రబాబు విడుదల చేసిన ఉత్తర్వులపై కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కార్మికులకు శిక్షల విధింపులో మార్పులు తీసుకొచ్చినా విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించకుండా అప్రమత్తంగా ఉండాలని ప్రయాణికులు కోరుతున్నారు.బస్సు కండక్టర్‌ విధి నిర్వహణలో వచ్చిన నగదును అధికారులకు అప్పజెబుతారు. ఈ సమయంలో ఒక్క రూపాయి తక్కువ వచ్చినా సస్పెండ్‌ లేదా విధుల నుంచి తొలగిస్తారు. బస్సు డ్రైవర్‌ తప్పిదం లేకపోయినా కొన్ని సందర్భాల్లో ప్రాణహాని జరుగుతుంది. ఇలాంటి కేసుల్లోనూ తన తప్పిదం లేకపోయినా కార్మికులను సస్పెండ్‌ చేయడం, విధుల నుంచి తొలగించడం చేస్తున్నారు. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసుల్లో అనవసరంగా కార్మికులకు శిక్షలు వేస్తున్నారు. బ్రీత్‌ అనలైజర్‌ యంత్రం సరిగ్గా పనిచేయకపోవడం వలన మద్యం తాగినట్టు చూపుతోంది. ఇలాంటి ఘటనలు అధికంగా జరుగుతున్నాయి. ఈ తప్పులకు కార్మికులను విధుల నుంచి పక్కన పెట్టడం, ఇంక్రిమెంట్లలో కోత విధిస్తున్నారు.బస్సు ప్రయాణం సమయంలో విడి భాగాలు పనిచేయకపోయినా, టైరు పగిలిపోయినా కార్మికులకు శిక్షలు అమలు చేస్తున్నారు. తమ ప్రమేయం లేకపోయినా బాధ్యులను చేయడం సరికాదని చెబుతున్నారు. ఈ శిక్షకు వేతనంలో ఇంక్రిమెంట్‌లో కోత విధిస్తున్నారు. బస్సు ప్రయాణించే సమయంలో టైరు పగిలితే అజాగ్రత్తగా వ్యవహరించారంటూ రూ.500 వసూలు చేస్తున్నారు. నిర్దేశించిన కేఎంపీఎల్‌ సాధించకపోతే జిల్లా కేంద్రానికి శిక్షణ నిమిత్తం పంపుతున్నారు. స్పీడ్‌ బ్రేకర్ల ద్వారా బస్సు విడిభాగాలు దెబ్బతింటే ఇంక్రిమెంట్లు, ఇన్సింటివ్‌లో కోత విధిస్తున్నారు. సమయపాలన పాటించకపోయినా శిక్షలు అమలు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Facebook Auto Publish Powered By : XYZScripts.com